గోదావరిఖని: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా ఉన్నాయని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) 2023లోని సంబంధిత సెక్షన్ల కింద వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈనెల 11న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి సరైన సంకేతం కాదన్నారు. రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, రైతుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు చెల్కలపల్లి శ్రీనివాస్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, కిరణ్‌జీ తదితరులు పాల్గొన్నారు.
గంగాధర: మండల పరిధిలోని ఎల్లమ్మదారిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాటస్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లమ్మదారి పరిసర ప్రాంతాల్లో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడి చేసి పేకాటరాయుళ్లను పట్టుకున్నామని వీరి నుంచి రూ. 52,380 నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొరు. అరెస్టయిన వారిని గంగాధర, కొత్తపల్లి, నారాయణపూర్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, దాడిలో ఆర్‌ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుళ్లు వెంకట్, తిరుపతి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
జమ్మికుంట: పట్టణంలోని శ్రీదుబ్బామల్లికార్జునస్వామి ఆలయం సమీపంలో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామానికి చెందిన దాసరి రామూర్తిగౌడ్ (51) జమ్మికుంట హౌజింగ్‌బోర్డు కాలనీకి వలస వచ్చాడు. 20 ఏళ్లుగా స్థానికంగా నివాసం ఉంటూ కేబుల్ అపరేటర్‌గా ఉపాధి పొందుతున్నాడు. కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. సోమవారం రాత్రి మాతా వైష్ణోదేవి కాట్రా ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేశామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతదేహాన్ని కొలనూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.


