కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రానికి 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ఆతిథ్యం దక్కడం తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా మహోత్సవం ద్వారా తెలంగాణ యువతకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు అపూర్వ అవకాశాలు లభించనున్నాయి. ఉమ్మడి జిల్లా కొన్నేళ్లుగా రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను అందిస్తోంది. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వుషు, రెజ్లింగ్, జూడో, రగ్బీ, సాఫ్ట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నారు.
సదుపాయాల అభివృద్ధికి ఊతం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణతో తెలంగాణలో క్రీడా సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పలు క్రీడా అకాడమీలు, శిక్షణ కేంద్రాలు, మినీ స్టేడియాలు, పాఠశాలస్థాయి క్రీడా వేదికలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ గేమ్స్ నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కేవలం ఒక క్రీడా పోటీ మాత్రమే కాదు. భావితర భారత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదిక. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరీంనగర్‌లో జూడో, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఖోఖో, జగిత్యాలలో బాక్సింగ్, సిరిసిల్లలో కబడ్డీ ఖేలో ఇండియా సెంటర్లు కొనసాగుతున్నాయి. ఇక వారు పతకాల వేటకు ప్రాక్టీస్‌ను ప్రారంభించగా.. నిర్వాహకులు రాష్ట్రంలో జరిగే పోటీలపై సన్నాహాలు ప్రారంభించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం క్రీడా రంగానికి గొప్ప గౌరవం. ఈ అవకాశంతో యువ క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీల అనుభవం లభిస్తుంది. తెలంగాణ దేశంలో ప్రముఖ క్రీడా రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. ఉమ్మడి జిల్లాలో అపారమైన క్రీడా ప్రతిభ ఉంది. ఈ గేమ్స్ ద్వారా ఆ ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది.
– గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి,
రాష్ట్ర ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ ఆతిథ్యం నిదర్శనం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణతో సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కరీంనగర్ జిల్లా నుంచి మరింత మంది జాతీయ క్రీడాకారులు ఎదిగే అవకాశం ఉంది.
– నందెల్లి మహిపాల్,
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు
ఖేలో ఇండియా యూత్ క్రీడలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పాఠశాలలు, కళాశాలల నుంచి మరింత మంది క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణకు లభించిన ఈ గౌరవం ప్రతి క్రీడాభిమానిని ఆనందపరుస్తోంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
– తుమ్మల రమేశ్‌రెడ్డి,
ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు
గ్రామీణ క్రీడాకారుల కలల వేదికంటున్న క్రీడా విశ్లేషకులు
ఇక సాధనపై కన్ను.. పతకాల వేటలో క్రీడాకారులు
ఉమ్మడి జిల్లా క్రీడా ప్రతిభకు మరో సువర్ణావకాశం


