రంగంలోకి జాతీయ అధినాయకత్వం
నేతల మధ్య ఇగోలు, సమన్వయలేమి
పార్టీకి మైలేజ్ పెరుగుతున్నా ఓట్లు పొందడంలో వైఫల్యం
రాజకీయ ప్రత్యర్థులకంటే అంతర్గత కుమ్ములాటలే పెద్ద మైనస్
ఏళ్లుగా జెండా మోసిన సీనియర్లకు, ఇటీవలి వలస నేతల నడుమ కోల్డ్ వార్
ఆరెస్సెస్ అనుకూల శక్తులతో క్షేత్రస్థాయి సర్వే నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: కమలదళానికి కాయకల్ప చికిత్స సిద్ధమైంది. బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యమైన అధికార సాధన అనే కీలక ఘట్టానికి చేరడంలో రాష్ట్రపార్టీ ఎదుర్కొంటున్న బలహీనతలు, ఇబ్బందులను జాతీయ అధినాయక త్వం గుర్తించింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేత ల ఈగోలు, సమన్వయలేమి అనేవి ప్రధాన స మస్యలుగా మారాయని గుర్తించి ‘కీలెరిగి వాత’పెట్టేందుకు సమాయత్తమైనట్లుగా బీజేపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.
దశాబ్దాలుగా తెలంగాణలో బీజేపీకి గుర్తింపు ఉన్నా, గత 10–15 ఏళ్లుగా పూర్తిస్థాయిలో రాజకీయంగా పుంజుకునే అవకాశాలున్నా వాటిని వినియోగించుకోకపోవడంపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా గత కొన్నినెలలుగా పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు లేని రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆరెస్సెస్) అనుకూల శక్తుల ద్వారా రాష్ట్రంలోని పరిస్థితులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించినట్లు తెలిసింది.
క్షేత్రస్థాయి లోపాలపై నివేదికలు..: బీజేపీ పట్ల, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప ట్ల తెలంగాణ ప్రజలు పూర్తి ఆదరాభిమానాల ను ప్రదర్శిస్తున్నా దానిని రాష్ట్రపార్టీ నాయకులు ఉపయోగించుకోలేక పోవడానికి ప్రధాన కారణాలను సంఘ్ పరివార్ ప్రతినిధులు గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో తాము జరిపిన సుదీర్ఘ అధ్యయనం ఆధారంగా రూపొందించిన ఓ నివేదికను జాతీయ నాయకత్వానికి అందజేసినట్లు సమాచారం.
తెలంగాణలో బీజేపీ పూర్తిస్థాయిలో పుంజుకుని, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడానికి ముఖ్యనేతలంతా ‘ఎవరికి వారే యమునాతీరే’అన్నట్టుగా వ్యవహరిస్తుండడం ముఖ్యమైన సమస్యగా పరిణమించిందని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో (3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు గెలుపు)ముఖ్యనేతల మధ్య గ్రూపుల సమస్య తీవ్రస్థాయికి చేరినట్లుగా వారు అంచనా వేసినట్లు సమాచారం.
సర్వేల్లో సమస్యలు తేటతెల్లం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా ‘కాషాయజెండా’పాతుతామని ఢిల్లీ పెద్దలు గట్టిగా చెబుతున్నా దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అందుకు తగిన పరిస్థితులు లేవని పరిశీలకులు తేల్చినట్లు పార్టీవర్గాల సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరుగుతున్నా నేతల మధ్య ఉన్న అంతరాలు, గ్రూపు రాజకీయాల వల్ల అది ఓట్లుగా మారడం లేదని బీజేపీ హైకమాండ్ గుర్తించింది. రాష్ట్ర బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులు, బయటి శత్రువుల కంటే కూడా అంతర్గతంగా లోపలి వారే పెద్ద మైనస్‌గా మారారని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని ఉమ్మడిగా ముందుకు నడపాల్సిన నేతలే ఒకరి కాళ్లు మరొకరు లాక్కుంటూ, పరస్పరం గోతులు తవ్వుకుంటున్నారని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఉడుకుతున్న ఉత్తర తెలంగాణ...
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రూపు రాజకీయాల కుంపట్లు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇక వాటికి చెక్ పెట్టాల్సిన రోజులు దగ్గరపడ్డాయని అగ్రనేతలు గుర్తించినట్లు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన సీనియర్ నేతలకు, కొన్నేళ్ల క్రితం చేరిన వలస నేతలకు మధ్య తీవ్రస్థాయిలో నడుస్తున్న కోల్డ్ వార్‌కు సైతం చరమగీతం పాడాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యనేతలు, ఎంపీలు మధ్య విభేదాలను అస్త్రంగా చేసుకుని ఇతర విపక్షాలు సోషల్ మీడియాలో ట్రోల్స్, ట్రాప్స్ రెడీ చేస్తున్నాయి.
ఇదే సమయంలో సొంత పార్టీలోని కొందరు నేతలు సైతం వీరి మధ్య గొడవలున్నాయని సాకుగా చూపుతూ...తమకు అవకాశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం పార్టీని మరింత బలహీనపరుస్తోందని ఈ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విభేదాలకు చెల్లుచీటి దిశలో అధినాయకత్వం వెంటనే చర్యలతోపాటు ఆయా నేతల మధ్య సంధికి సమాలోచనలతో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సంకేతాలు ఇచి్చనట్లుగా పార్టీవర్గాల సమాచారం.


