ఛత్రపతి శంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్ తాలూకా పరిధిలోని ముద్దేశ్వడ్‌గావ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ, ప్రమాదవశాత్తూ వేడి కూర పాత్రలో పడి మృతి చెందింది. మృతురాలిని రుతుజా శ్రవణ్ రాజ్‌పుత్‌గా పోలీసులు గుర్తించారు. జూలై 19న రుతుజ తన ఇంట్లో ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. చిన్నారి ఆడుకునే క్రమంలో అనుకోకుండా మరుగుతున్న వేడి కూర ఉన్న పాత్రలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలైంది. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై, చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యుల సూచన మేరకు ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి రెండు వారాల పాటు ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యులు చికిత్స అందించారు. తీవ్ర గాయాలపాలైన రుతుజ పరిస్థితి క్రమంగా క్షీణించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్న సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తతతో ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.


