గంజాం: కుటుంబ కలహాల కారణంగా ఒక యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఒక యువకుడు తన నాలుకను కోసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బెగునియాపడ పోలీసు స్టేషన్ పరిధిలోని హన్సతులి గ్రామానికి చెందిన కిరణ్ పాత్ర కుటుంబ తగాదాల కారణంగా గ్రామ సమీపంలోని కాళీ ఆలయం వద్ద ఈ చర్యకు పాల్పడ్డాడు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన కిరణ్, ఆలయం వెలుపల పదునైన కత్తితో తన నాలుకను కోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ ద్వారా అతడిని తొలుత ఖళ్‌కోట్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపురంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఈజిప్ట్‌లో భూకంపం.. కెమెరాలో రికార్డయిన దృశ్యాలు


