ప్రతీకాత్మక చిత్రం
కర్ణాటకలో హెచ్‌ఐవీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువతలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీల్లో హెచ్‌ఐవీ అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైన వారు స్వచ్ఛందంగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది.
రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే వ్యక్తుల అనుమతి లేకుండా ఎలాంటి పరీక్షలు లేదా స్క్రీనింగ్ నిర్వహించబోమని అధికారులు స్పష్టం చేశారు. గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు.
యువతలో పెరుగుతున్న కేసులు
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) గణాంకాల ప్రకారం.. హెచ్‌ఐవీ బాధితుల సంఖ్యలో కర్ణాటక దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.60 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. వీరిలో దాదాపు 2.05 లక్షల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మరో 54 వేల మందికి తమ హెచ్‌ఐవీ స్థితి గురించి తెలియకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో కేసులు వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో ఈ వయసు వర్గంలో హెచ్‌ఐవీ కేసులు 44,500గా ఉండగా.. 2025–26 నాటికి ఈ సంఖ్య 66,600కు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక 18 నుంచి 25 ఏళ్ల మధ్య .. అదీ విద్యార్థుల్లోనే 7,000 మందికి పైగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
కాలేజీల్లో అవగాహన శిబిరాలు
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్‌ఐవీపై అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు వైరస్ వ్యాప్తి, నివారణ మార్గాలు, చికిత్స అవకాశాలపై సమాచారం అందించనున్నారు. విద్యార్థులు తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పెంచుకునేందుకు ప్రత్యేకంగా QR కోడ్ ఆధారిత సమాచార వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా సమీప కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు.
లక్ష్యం.. భయాన్ని కాదు, అవగాహనను పెంచడం
హెచ్‌ఐవీపై ఉన్న అపోహలు, వివక్షను తగ్గించడంతో పాటు.. బాధితులు సకాలంలో చికిత్స పొందేలా చూడడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. హెచ్‌ఐవీని ముందుగానే గుర్తిస్తే మెరుగైన జీవనం కొనసాగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు యువతలో ఆరోగ్య అవగాహన పెంచేందుకు కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యార్థుల గోప్యత, సమ్మతిని కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.


