మెల్ రాబిన్స్, జోసెఫ్ కాఫ్లిన్
మెసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) ‘ఏజ్‌ల్యాబ్’ డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ కాఫ్లిన్... వృద్ధాప్యం, దీర్ఘాయువు గురించి ఉన్న అపోహలను పటాపంచలు చేశారు. ఎవరి సహాయమూ లేకుండా స్వతంత్రంగా జీవించడమే అసలైన దీర్ఘాయువు అని అంటున్నారు. మీ దగ్గర ఎంతుందన్నది ముఖ్యం కాదు!
వయస్సు పైబడుతున్నప్పుడు డబ్బు ఆదా చేయడం, ఆర్థిక ప్రణాళికలు వేసుకోవటం పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కానీ మనం ఉండే నివాస స్థలాన్ని బట్టి కూడా సగటు జీవితకాలంలో 9 నుండి 13 సంవత్సరాల తేడా వస్తుంది. నడవడానికి అనుకూలమైన రోడ్లు, నమ్మకమైన రవాణా సదుపాయాలు, తాజా ఆహారం, మంచి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటమే మీరు ఎంతకాలం, ఎంత ఆరోగ్యంగా జీవిస్తారో నిర్ణయిస్తాయి తప్ప మీ దగ్గర ఉన్న ‘పొదుపు మొత్తం’ కాదు. ఒకవేళ మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఏకాకిగా మార్చితే, మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ మీ శారీరక, మానసిక ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది.
తరాలుగా మనకు నేర్పించలేదు!
జీవితాన్ని నేను 8,000 రోజుల చొప్పున నాలుగు భాగాలుగా చూస్తాను. 0 నుండి 21 సంవత్సరాలు (నేర్చుకునే దశ); 21 నుండి 46 (కెరీర్, కుటుంబం); 46 నుండి 65 (మధ్యవయసులో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం); 65 నుండి 85 పైన (చివరి దశ). ఈ చివరి దశ అనేది పూర్తి అదనపు 8,000 రోజుల ఒక కొత్త అంకం. కేవలం విహారయాత్రలకు వెళ్లడం, లేదా ఖాళీ గదికి రంగులు వేసుకోవడం లాంటి చిన్న చిన్న పనులు మిమ్మల్ని రెండు దశాబ్దాల పాటు ఉత్సా హంగా ఉంచలేవు. జీవితంలో ఈ కొత్త అధ్యాయం కోసం మీకు ఒక పక్కా ప్రణాళిక అవసరం. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా ఎలా ఉండాలో నేర్పించ డానికి సమాజం తరతరాలుగా సమయాన్ని వెచ్చించింది. కానీ ఆ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో నేర్పించడానికి మాత్రం దాదాపు సున్నా సమయాన్ని కేటాయించింది.
వేసవి రాత్రి ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే?
ఫైనాన్షియల్ ప్లానర్లు మీరు వైద్య ఖర్చులను భరించ గలరా అని అడుగుతారు; కానీ నేను చాలా సరళంగా అనిపించే ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వేడి వేసవి రాత్రి మీకు ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే, మీరు దాన్ని ఎలా వెళ్లి తెచ్చుకుంటారు? ఉదాహరణకు 50 ఏళ్లు పైబడిన అమె రికన్లలో 70 శాతం కంటే ఎక్కువ మంది నగర శివారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లే శక్తిని పూర్తిగా కోల్పోవడమే. నిజమైన స్వేచ్ఛ అంటే కేవలం జీవించి ఉండటం కాదు; వేరొకరిని లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేకుండా, మీకు అనిపించిన వెంటనే చిన్న చిన్న ఆనందాలను పొంద గలిగే రవాణా సౌకర్యాలు ఉండటం. ఒక చిన్న ప్రయాణం కోసం మీరు కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చినా, లేదా బిజీగా ఉండే మీ పిల్లలపై పూర్తిగా ఆధారపడాల్సి వచ్చినా... మీరు ఇప్పటికే మీ స్వేచ్ఛను పోగొట్టుకున్నట్లే.
ఒంటరి హాబీలతో విసుగెత్తిపోతుంది!
రిటైర్మెంట్ తర్వాత గార్డెనింగ్ చేస్తాననీ లేదా గోల్ఫ్ ఆడతాననీ పరిచయస్తులు తరచూ నాతో చెబుతుంటారు. కానీ మానవ సంబంధాలు లేకుండా ఒంటరిగా కల్పించుకునే హాబీలు త్వరగా విసుగు తెప్పిస్తాయని కోవిడ్–19 లాక్‌డౌన్లు నిరూపించాయి. మీకు కేవలం ఆర్థిక ప్రణాళికలు ఉంటే సరిపోదు. ఒక మామూలు మంగళవారం ఉదయం 10:30 గంటలకు మిమ్మల్ని కలిసి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉండే మనుషులతో కూడిన ఒక యాక్టివ్ ‘సామాజిక పోర్ట్‌ఫోలియో’ కూడా మీకు అవసరం. మీరు ఉద్యోగానికి దూరమైనప్పుడు, ప్రతిరోజూ లభించే సాధారణ సామాజిక సంబంధా లను, ఒక దినచర్యను కోల్పోతారు. మీరు వేర్వేరు తరాల ప్రజలతో ఉద్దేశపూర్వకంగా సంబంధాలను పెంచుకోకపోతే; మీకు నలుగురితో సంభాషణలు, సామాజిక భాగస్వామ్యం లేకపోతే, అత్యంత అవస రమైన సమయంలోనే మీ సామాజిక ప్రపంచం కుంచించుకుపోయి ఉంటుంది.
- ఎడిటోరియల్ టీమ్


