విఘ్నాలను తొలగించి, విజయాన్ని ప్రసాదించే లంబోదరుడి ఆగమనం ప్రతి ఇంటా సంతోషాలను అందిస్తుంది. బొజ్జ గణపయ్య రూపం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాదు.. అందులో లోతైన జీవిత సత్యాలతో పాటు క్రమశిక్షణతో కూడిన పర్సనల్ ఫైనాన్స్ సూత్రాలు నిగూఢమై ఉన్నాయి. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి అనే చందంగా, ఆర్థిక కష్టాలు దరిచేరక ముందే జాగ్రత్త పడటానికి వినాయకుడి శారీరక లక్షణాలు అద్భుతమైన మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
పెద్ద తల.. విస్తృత ఆలోచన
గజాననుడి పెద్ద తల సుదూర ఆలోచనకు ప్రతీక. ఆర్థిక జీవితంలో కూడా స్వల్పకాలిక లాభాలకే పరిమితం కాకుండా దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించుకోవాలి. రూపాయి పొదుపు – వంద రూపాయిల ఆదాయం అనే రీతిలో కష్టపడి సంపాదించిన సొమ్మును కాంపౌండింగ్ పవర్ ద్వారా దీర్ఘ కాలంలో సంపదగా మార్చడానికి ఇది పునాది వేస్తుంది.
చిన్న కళ్లు.. సూక్ష్మ పరిశీలన
గణపతి చిన్న కళ్లు దేనినైనా లోతుగా, సూక్ష్మంగా పరిశీలించడాన్ని సూచిస్తాయి. మార్కెట్లో కనిపించే మెరుపులన్నీ బంగారం కావు. పక్కవారి మాటలు విని గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదు. ఏదైనా పథకంలో లేదా షేర్లలో ఇన్వెస్ట్ చేసే ముందు దాని రిస్క్, రాబడిని నిశితంగా విశ్లేషించాలి.
పెద్ద చెవులు.. శ్రద్ధగా వినడం
ఏనుగు చెవుల వలే పెద్దగా ఉండే వినాయకుని చెవులు మనకు అవసరమైన అంశాలను శ్రద్ధగా వినాలని నేర్పుతాయి. పర్సనల్ ఫైనాన్స్‌లో మార్కెట్ వార్తలు, ఆర్థిక నిపుణుల సలహాలు జాగ్రత్తగా వినాలి. మంచి చెడులను బేరీజు వేసి మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలి.
తొండం.. అనుకూలత
తొండం ఫ్లెక్సిబిలిటీకి ప్రతీక. భారీ వృక్షాలను కూల్చగలదు.. అలాగే చిన్న గడ్డిపరకను కూడా సున్నితంగా పట్టుకోగలదు. అన్ని గుడ్లను ఒకే గంపలో పెట్టకూడదు అనే సామెతలాగా, మన పెట్టుబడులను ఈక్విటీలు, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రకాల ఆస్తుల్లో విభజించాలి (డైవర్సిఫికేషన్). ఇది అత్యవసర సమయాల్లో ఆర్థిక రక్షణను ఇస్తుంది.
పెద్ద బొజ్జ.. ఆర్థిక క్రమశిక్షణ
గణనాథుడి లంబోదరం అన్ని మంచి చెడులను మింగి జీర్ణించుకునే శక్తికి సంకేతం. మన ఆర్థిక ప్రయాణంలో ఎదురయ్యే ఆకస్మిక నష్టాలు, ఆర్థిక అత్యవసర పరిస్థితులు (ఉద్యోగం పోవడం, వైద్య ఖర్చులు) తట్టుకోవడానికి తగినంత అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) ఏర్పాటు చేసుకోవాలి.
చిన్న ఎలుక.. ఖర్చులపై నియంత్రణ
భారీ ఆకారం ఉన్న గణనాథుడు చిన్న మూషికాన్ని వాహనంగా ఉపయోగిస్తాడు. అంటే ఎంతటి భారీ ఆదాయం ఉన్నా చిన్న ఆశలను, అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని ఇది సూచిస్తుంది. ఆదాయం చూసి ఖర్చు చేయాలి అన్నట్లుగా చిన్న అప్పులు లేదా అనవసరపు ఖర్చులు సుడిగుండాల్లా మారి సంపదను దెబ్బతీయకుండా చూసుకోవాలి.
ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!


