ప్రీమియం ఫోన్ మేకర్ యాపిల్ తన కొత్త ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా జరిగిన యాపిల్ ఈవెంట్‌లో వీటిని ఆవిష్కరించగా.. భారత్‌లో ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి, సాధారణ విక్రయాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
వేరియబుల్ అపెర్చర్‌తో 48MP కెమెరా
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా విభాగంలో కనిపిస్తుంది. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు తొలిసారిగా ‘మెకానికల్ వేరియబుల్ అపెర్చర్’ను యాపిల్ తీసుకొచ్చింది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా కాంతి ప్రవేశాన్ని మార్చడంతో పాటు ఫొటోల్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌పై ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రా వైడ్, 48MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్-క్వాలిటీ జూమ్, 40x వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. కెమెరా యాప్‌లో అపెర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్ వంటి ప్రొఫెషనల్ కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులు మార్చుకోవచ్చు.
వీడియో విషయానికి వస్తే 4K డాల్బీ విజన్‌ను 120fps వరకు రికార్డ్ చేయొచ్చు. 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను కూడా యాపిల్ అందించింది.
ఫొటోలు నిజమైనవో.. మార్చినవో గుర్తించే టెక్నాలజీ
ఐఫోన్ 18 ప్రోలో Apple Reference Image అనే కొత్త ఫీచర్‌ను యాపిల్ ప్రవేశపెట్టింది. కెమెరా నుంచి వచ్చిన పిక్సెల్ డేటాకు క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్ జతచేసి, అసలు చిత్రానికి సంబంధించిన రిఫరెన్స్‌ను భద్రపరచే విధంగా దీనిని రూపొందించారు. దీంతో ఫొటోపై తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో గుర్తించడంలో సహాయపడుతుంది. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన చిత్రాలను గుర్తించే విధంగా SynthID సపోర్ట్‌ను కూడా యాపిల్ ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్ల లభ్యత భిన్నంగా ఉండొచ్చు.
A20 ప్రో చిప్
రెండు కొత్త ప్రో మోడళ్లలోనూ A20 Pro చిప్ ఉంటుంది. 2nm ప్రాసెస్‌పై తయారైన ఈ చిప్‌లో సిక్స్-కోర్ CPU, న్యూరల్ యాక్సిలరేటర్లతో ఏడు-కోర్ GPU, డ్యూయల్ 16-కోర్ Neural Engine ఉన్నాయి. హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ కూడా అందుబాటులో ఉంది. మెరుగైన పనితీరును కొనసాగించేందుకు కొత్త తరం ‘వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్’ను కూడా యాపిల్ తీసుకొచ్చింది. A20 Pro, కొత్త థర్మల్ డిజైన్ కలయికతో ఐఫోన్ చరిత్రలోనే అత్యుత్తమ స్థిరమైన పనితీరును అందిస్తామని కంపెనీ పేర్కొంది.
కొత్త కనెక్టివిటీ చిప్స్
వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం కొత్త N1 చిప్‌ను ఉపయోగించారు. ఇది Wi-Fi 7, Bluetooth 6, Thread నెట్‌వర్కింగ్‌కు మద్దతు ఇస్తుంది. సెల్యులార్ కనెక్టివిటీ కోసం యాపిల్ రూపొందించిన C2 మోడెమ్ ఉంది.
120Hz డిస్‌ప్లే.. చిన్నదైన డైనమిక్ ఐలండ్
ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల, ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ OLED డిస్‌ప్లేలు ఉన్నాయి. రెండింటిలోనూ 120Hz వరకు ప్రోమోషన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, డైనమిక్ ఐలండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈసారి డైనమిక్ ఐలండ్ పరిమాణాన్ని తగ్గిస్తూ మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దినట్లు యాపిల్ తెలిపింది. ఒకేసారి మూడు లైవ్ యాక్టివిటీస్‌ను ప్రదర్శించే సామర్థ్యం కూడా ఉంది.
43 గంటల వరకు బ్యాటరీ
బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్గత డిజైన్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా eSIM-ఓన్లీ వేరియంట్లలో సిమ్ ట్రే కోసం ఉపయోగించే స్థలాన్ని పెద్ద బ్యాటరీకి కేటాయించగలిగారు. యాపిల్ ప్రకారం ఐఫోన్ 18 ప్రోలో 34 గంటల వరకు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 43 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లభిస్తుంది. MagSafe, Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు USB-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. 60W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్‌తో సుమారు 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
iOS 27తో AI ఫీచర్లు
కొత్త ప్రో మోడళ్లు iOS 27తో వస్తాయి. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెరుగైన సిరి ఏఐ, స్క్రీన్‌పై కనిపిస్తున్న సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం, యాప్‌ల మధ్య సందర్భాన్ని కొనసాగించే ఫీచర్లు, కెమెరా ఆధారిత విశ్లేషణ వంటి కొత్త సామర్థ్యాలను యాపిల్ అందిస్తోంది.
భారత్‌లో ధరలు ఇవే
ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.1,89,900, 1TB ధర రూ.2,39,900, 2TB ధర రూ.3,14,900.
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900. 512GB రూ.2,04,900, 1TB రూ.2,54,900, 2TB రూ.3,29,900గా ఉన్నాయి.
బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, కొత్త బర్గండీ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. భారత్‌లో సెప్టెంబర్ 12న సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
ఇదీ చదవండి: ఐఫోన్ ధరలు.. ఈ దేశాల్లో కాస్త చౌక!


