పదేళ్ల నుంచి తయారవుతున్న ఐఫోన్‌! ఇక వచ్చేస్తోంది.. | Apple Foldable iPhone Decade Development Price Design Features | Sakshi
Sakshi News home page

పదేళ్ల నుంచి తయారవుతున్న ఐఫోన్‌! ఇక వచ్చేస్తోంది..

Sep 9 2026 4:01 PM | Updated on Sep 9 2026 4:27 PM

Apple Foldable iPhone Decade Development Price Design Features

దాదాపు దశాబ్ద కాలంగా ఊహాగానాలకే పరిమితమైన యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ఎట్టకేలకు వెలుగులోకి వస్తోంది. సెప్టెంబర్‌ 9న అమెరికాలోని కుపర్టినోలో నిర్వహిస్తున్న ‘సప్రైజ్‌ అండ్‌ షైన్‌’ (Surprise and Shine) ఈవెంట్‌లో యాపిల్‌ కొత్త ఐఫోన్‌ లైనప్‌ను ఆవిష్కరిస్తోంది. ఈ కార్యక్రమం సంస్థ కొత్త సీఈఓ జాన్‌ టెర్నస్‌ నేతృత్వంలో జరిగే తొలి ప్రధాన ప్రొడక్ట్‌ లాంచ్‌ కావడం విశేషం.

టిమ్‌ కుక్‌ ఆసియా పర్యటనతో వేగం

యాపిల్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ ఆలోచన కొత్తది కాదు. 2010ల నుంచే కంపెనీ ఫోల్డింగ్‌ డిస్‌ప్లేలు, హింజ్‌ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం. 2019లో శామ్‌సంగ్‌ తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముందే 2016 ప్రాంతంలో యాపిల్‌ ఇంజినీరింగ్‌ బృందాలు ఈ టెక్నాలజీపై ప్రయోగాలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2020లో టిమ్‌ కుక్‌ ఆసియా పర్యటనలో ఫోల్డబుల్‌ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను గమనించిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది.

మొదట పెద్ద స్క్రీన్‌తో మడిచే ఐప్యాడ్‌ తరహా పరికరాన్ని రూపొందించే ఆలోచన యాపిల్‌ చేసింది. అయితే చివరకు కంపెనీ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ వైపు మొగ్గుచూపింది. సంస్థలో ఈ ప్రాజెక్ట్‌ ‘V68’ అనే కోడ్‌నేమ్‌తో కొనసాగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

పాస్‌పోర్ట్‌ తరహా డిజైన్‌?

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కొత్త ఫోల్డబుల్‌ ఐఫోన్‌ బుక్‌ లేదా పాస్‌పోర్ట్‌ తరహాలో తెరుచుకునే డిజైన్‌తో ఉండొచ్చని అంచనా. ఫోన్‌ ఫోల్డ్‌ తెరిచినప్పుడు సుమారు 7.8 అంగుళాల అంతర్గత డిస్‌ప్లే, బయట 5.5 అంగుళాల కవర్‌ స్క్రీన్‌ ఉండొచ్చని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి లీకులు, విశ్లేషకుల అంచనాలే. యాపిల్‌ అధికారికంగా ఫోన్‌ పేరును, స్పెసిఫికేషన్లను, ధరను ఇంకా ధ్రువీకరించలేదు.

ధర రూ.2 లక్షలు దాటే అవకాశం

ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ధర విషయంలో మాత్రం భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ప్రారంభ ధర 2,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి. అధిక స్టోరేజ్‌ వేరియంట్ల ధర 3,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత మార్కెట్లో ఇది సుమారు రూ.1.7 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.

ఫోల్డబుల్‌ మార్కెట్‌కు కొత్త ఊపు?

ప్రస్తుతం ఫోల్డబుల్‌ ఫోన్లు మొత్తం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చిన్న వాటానే కలిగి ఉన్నప్పటికీ, సాధారణ స్మార్ట్‌ఫోన్ల కంటే ఈ విభాగం వేగంగా పెరుగుతోంది. 2026లో ఫోల్డబుల్‌ ఫోన్‌ షిప్‌మెంట్లు సుమారు 12.6% పెరుగుతాయని IDC అంచనా వేస్తోంది. అదే సమయంలో గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ మొత్తం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యాపిల్‌ ప్రవేశంతో ఈ విభాగానికి మరింత ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2027 నాటికి యాపిల్‌ 17 మిలియన్లకు పైగా ఫోల్డబుల్‌ ఐఫోన్లు విక్రయించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

జాన్‌ టెర్నస్‌కు కీలక పరీక్ష

ఈ లాంచ్‌ కేవలం కొత్త ఐఫోన్‌ పరిచయం మాత్రమే కాదు. యాపిల్‌ నాయకత్వంలోనూ ఇది కీలక మలుపు. సెప్టెంబర్‌ 1న టిమ్‌ కుక్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మారగా, జాన్‌ టెర్నస్‌ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌ 9 ఈవెంట్‌ ఆయనకు సీఈఓగా తొలి ప్రధాన ప్రొడక్ట్‌ లాంచ్‌ కానుంది.

అందుకే ఫోల్డబుల్‌ ఐఫోన్‌ విజయం టెర్నస్‌ నాయకత్వానికి మాత్రమే కాకుండా.. ఐఫోన్‌ తర్వాతి దశను యాపిల్‌ ఎలా నిర్వచించబోతోందన్న దానికి కూడా కీలక సంకేతంగా మారనుంది. దాదాపు 20 ఏళ్ల ఐఫోన్‌ చరిత్రలో ఇది అత్యంత పెద్ద డిజైన్‌ మార్పుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

(యాపిల్‌ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement