టెక్ దిగ్గజం యాపిల్‌కు సుమారు 15 సంవత్సరాలు సీఈఓగా నాయకత్వం వహించిన టిమ్ కుక్ (Tim Cook) ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తన చివరి రోజు సందర్భంగా.. ఉద్యోగులకు ఆయన ఒక భావోద్వేగమైన సందేశం పంపారు.
ఇంతకాలం తనకు ఇచ్చిన సహకారం, ప్రేమ, మద్దతుకు ఉద్యోగులందరికీ టిమ్ కుక్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఒక అద్భుతమైన టీమ్‌గా ఆయన ప్రశంసించారు. సీఈఓగా తన విజయానికి తాను మాత్రమే కారణం కాదని, తనతో కలిసి పనిచేసిన ఉద్యోగుల వల్లే అది సాధ్యమైందని చెప్పారు. యాపిల్ సంస్కృతిని గురించి కూడా ప్రస్తావిస్తూ.. స్టీవ్ జాబ్స్‌కు నివాళులర్పించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఈఓ జాన్ టెర్నస్‌కు స్వాగతం పలికారు.
2011లో సీఈఓగా బాధ్యతలు
కుక్ 2011 నుంచి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. యాపిల్ సహ వ్యవస్థాపకుడు జాబ్స్ మరణించడానికి కేవలం కొన్ని వారాల ముందు ఆయన సంస్థ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అనేక విజయాలు సాధిస్తూ.. సంస్థను అభివృద్ధి చేశారు. ఈయన సారథ్యంలో అనేక కొత్త ఉత్పత్తులు లాంచ్ అయ్యాయి.
అయితే.. టిమ్ కుక్ యాపిల్ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగడం లేదు. ఆయన సీఈఓ పదవి నుంచి మాత్రమే తప్పుకుంటున్నారు. కానీ కంపెనీలో మరో కొత్త బాధ్యతలో కొనసాగనున్నారు. సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తులను తయారు చేయడంలో జాన్ టెర్నస్‌కు మంచి అనుభవం, సామర్థ్యం ఉందని కుక్ ప్రశంసించారు. తన తర్వాత సంస్థను చాలా బాగా నడిపిస్తారని ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
టిమ్ కుక్ సందేశం
యాపిల్ కంపెనీ నేడు ఈ స్థాయికి చేరుకుందంటే.. అది కేవలం ఒక వ్యక్తి వల్ల రాలేదని, మొత్తం టీమ్ కలిసి పనిచేయడం వల్లే వచ్చిందని కుక్ చెప్పారు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం, కష్టాల్లో సహాయం చేసుకోవడం, చేసే పనిపై బాధ్యతతో ఉండటం యాపిల్ సంస్కృతిలో ముఖ్యమైన భాగాలని వివరించారు. యాపిల్ ద్వారా ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రతి ఉద్యోగికి అవకాశం ఉందని, ఆ అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని ఆయన సూచించారు.


