జీఎస్‌టీ 2.0తో వృద్ధికి కొత్త ఇంధనం | GST 2. 0 has given a fresh push not just to the automobile industry | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ 2.0తో వృద్ధికి కొత్త ఇంధనం

Sep 1 2026 5:31 AM | Updated on Sep 1 2026 5:31 AM

GST 2. 0 has given a fresh push not just to the automobile industry

రేట్ల తగ్గింపుతో చిన్న కార్లకు పెరగనున్న డిమాండ్‌ 

2031 నాటికి 63 లక్షల యూనిట్లకు కార్ల మార్కెట్‌ 

36.5 లక్షల యూనిట్లకు మారుతీ ఉత్పత్తి సామర్థ్యం  

వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీఎస్‌టీ 2.0’ పన్ను సంస్కరణలు ఆటోమొబైల్‌ రంగంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలకు నూతన ఉత్తేజాన్నిచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం వంటి అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ సంస్కరణలు అవసరమైన రక్షణగా నిలిచాయన్నారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారులను ఉద్దేశించి భార్గవ మాట్లాడారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. 

జీఎస్‌టీ వసూళ్లు మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఇరాన్‌ సమస్యలు, పశ్చిమాసియా యుద్ధం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ పురోగతి కొనసాగుతోంది. జీఎస్‌టీ సంస్కరణలు లేకపోతే ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంస్థ ఈ స్థాయిలో రాణించేది కాదు’’ అని అన్నారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో దేశీయ కార్ల మార్కెట్‌కు కూడా గణనీయమైన ప్రయోజనం కలుగుతుందన్నారు. గత అయిదేళ్లతో పోలిస్తే రాబోయే రోజుల్లో చిన్న కార్ల మార్కెట్‌ వాటా మరింత వేగంగా పెరుగుతుందని అంచనా వేశారు. గత సెపె్టంబరులో జీఎస్‌టీ రేట్ల తగ్గింపు తర్వాత కార్ల డిమాండ్‌పై మారుతీ సుజుకీ తన అంచనాలను పునఃపరిశీలిస్తోందని భార్గవ తెలిపారు. 

2031 నాటికి 63 లక్షలకు కార్ల మార్కెట్‌  
భారత కార్ల మార్కెట్‌ 2031 నాటికి 61 లక్షల నుంచి 63 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉందని భార్గవ అంచనా వేశారు. ఈ వృద్ధికి అనుగుణంగా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న విస్తరణ ప్రాజెక్టులు పూర్తయితే మారుతీ సుజుకీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2026–27 నాటికి 29 లక్షల యూనిట్లకు, 2030–31 నాటికి 36.5 లక్షల యూనిట్లకు చేరుతుందని వివరించారు. హరియాణాలోని ఖర్‌ఖోడా ప్లాంట్‌లో రెండు ఉత్పత్తి లైన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, మూడో లైన్‌ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 

గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌ ప్లాంట్‌లో 2.5 లక్షల యూనిట్ల సామర్థ్యం గల నాలుగో లైన్‌ను ప్రారంభించడంతో అక్కడ మొత్తం సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు పెరిగిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సుజుకీకి అతిపెద్ద ప్లాంట్‌ అని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సానంద్‌లో కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని భార్గవ తెలిపారు. అక్కడ మొత్తం 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం సుమారు రూ.35,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించామని చెప్పారు. 

సంస్కరణలు జాతీయ కర్తవ్యం 
దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించే సంస్కరణలను అన్ని రాజకీయ పారీ్టలు జాతీయ కర్తవ్యంగా భావించాలని భార్గవ కోరారు. సంపద సృష్టి లేకుండా మరింత సుసంపన్న సమాజాన్ని నిర్మించడం, ఆర్థికంగా బలమైన భారత్‌ను తీర్చిదిద్దడం అసాధ్యం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, వ్యాపారం నిర్వహణను సులభతరం చేయాలని సూచించారు. టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం వల్ల అవినీతి, జాప్యం తగ్గుతాయని అన్నారు. ప్రభుత్వాలు ప్రైవేట్‌ రంగంపై నమ్మకం ఉంచడంతో పాటు పోటీ శక్తిని ప్రోత్సహించాలని సూచించారు. ‘‘ఆర్థిక బలం ఉంటేనే ప్రపంచంలో భారత్‌ బలంగా ఉంటుంది’’ అని భార్గవ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరించే కొద్దీ సంపద సృష్టి, ప్రభుత్వ ఆదాయాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.                          

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement