E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే! | E20 Petrol Supreme Court Rejects Ethanol Labelling Plea | Sakshi
Sakshi News home page

E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే!

Aug 31 2026 6:41 PM | Updated on Aug 31 2026 6:52 PM

E20 Petrol Supreme Court Rejects Ethanol Labelling Plea

మనలో చాలామంది పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు లీటర్ పెట్రోల్‌కు ఎంత డబ్బు చెల్లిస్తున్నామో అని మాత్రమే చూస్తాం. కానీ.. అందులో ఎంత ఇథనాల్ కలిపి ఉంది? అనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.

పెట్రోల్ బంకుల్లో అమ్ముతున్న ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో.. కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులను సంప్రదించుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది.

E20 పెట్రోల్
ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు E20 పెట్రోల్. ఇందులో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశంలోనే తయారయ్యే ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతోంది. అయితే.. కస్టమర్లు తాము కొంటున్న పెట్రోల్‌లో అసలు ఎంత ఇథనాల్ ఉందో తెలుసుకోవాలని కోరుతున్నారు.

వాహనదారుల్లో సందేహాలు
E20 పెట్రోల్‌పై వాహనదారుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పాత వాహనాల్లో ఈ20 ఇంధనం వాడితే మైలేజ్ ఎలా ఉంటుంది? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా? ఫ్యూయల్ సిస్టమ్‌కు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే మైలేజ్ అనేది.. కేవలం ఇంధనంపైనే మాత్రమే ఆధారపడి ఉంటుందనుకోవడం పొరపాటు. ఎందుకంటే.. డ్రైవింగ్ చేసే విధానం, ట్రాఫిక్, వెహికల్ మెయింటెనెన్స్, టైర్ ప్రెజర్, ఏసీ వినియోగం వంటి అంశాలు మైలేజిని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

పంటలపై ప్రభావం
ఇథనాల్ తయారీకి పంటలను ఉపయోగించడంపై కూడా చర్చ మొదలైంది. ఆహారం కోసం ఉపయోగించే పంటలను ఇంధనం తయారీకి ఉపయోగిస్తే.. భవిష్యత్తులో ఆహార ధరలపై ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. వ్యవసాయ వ్యర్థాలు, బయోమాస్‌తో 2జీ ఇథనాల్ తయారు చేయడం ద్వారా ఆహార పంటలపై ఒత్తిడి తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యర్థాలను ఉపయోగించి ఇంధనం తయారు చేస్తే ఫుడ్, ఫ్యూయల్ రెండింటి అవసరాలను బ్యాలెన్స్ చేయొచ్చన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement