పాతికేళ్ల వయసులో జాబ్ చేస్తూ బాగా సంపాదించాలని అందరూ అనుకుంటారు. కానీ 23 ఏళ్ల వయసులో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి తనకు ఇష్టమైన కొండలు, అడవులు, ట్రెక్కింగ్ వైపు అడుగులు వేసాడు విజయ్ ప్రతాప్ సింగ్. అదే అతన్ని సక్సెస్ వైపు తీసుకెళ్లింది, కోట్ల రూపాయల ఆదాయం గడించేలా చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన విజయ్ చదువుల కోసం డెహ్రాడూన్‌కు వెళ్లిన తర్వాత ప్రకృతికి చాలా దగ్గరయ్యాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అడవులు, కొండల్లో తిరిగేవాడు. అదే ఆసక్తి తర్వాత సొంత వ్యాపారం పెట్టాలనే ఆలోచనకు దారితీసింది.
ట్రెక్కింగ్‌తో సొంత కంపెనీ
విజయ్ అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీని ప్రారంభించాడు. ట్రెక్కింగ్ ట్రిప్స్, అవుట్‌డోర్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కంపెనీని క్రమంగా అభివృద్ధి చేశాడు. ఉద్యోగం వదిలే ముందే కంపెనీని ఎలా నడపాలనే దానిపై ప్లాన్ చేసుకున్నాడు. స్నేహితుల సహాయంతో వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలు ఏర్పాటు చేసి ట్రెక్కింగ్ బుకింగ్స్ ప్రారంభించాడు. 2016లో 12 మంది విద్యార్థులను చోప్టా-తుంగ్‌నాథ్ ట్రెక్‌కు తీసుకెళ్లడంతో అతని ట్రెక్ లీడర్ ప్రయాణం మొదలైంది.
శిక్షణతో బలమైన టీమ్
ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఒక్కటే మాత్రమే సరిపోదని విజయ్ అర్థం చేసుకున్నాడు. కొండల్లో భద్రత చాలా ముఖ్యమని భావించి నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తర్వాత శిక్షణ పొందిన ట్రెక్ లీడర్లతో 10 మంది సభ్యుల టీమ్‌ను ఏర్పాటు చేశాడు. వీరిలో కొందరికి మౌంటెనీరింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఫస్ట్ ఎయిడ్‌లో శిక్షణ ఉంది. ట్రెక్కింగ్‌కు వచ్చే వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ముందుగానే పరిశీలిస్తారు.
రూ.10 కోట్ల వరకు ఆదాయం
గత ఎనిమిదేళ్లలో తన అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీ ద్వారా లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, నేపాల్ వంటి ప్రాంతాలకు ట్రెక్కింగ్ ట్రిప్స్ నిర్వహించారు. ఈ కంపెనీ ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల ఆదాయం పొందినట్లు సమాచారం. అయితే.. ఎక్కువ ట్రెక్కులు నిర్వహించడం కంటే.. ప్రతి గ్రూప్‌కు మంచి అనుభవం ఇవ్వడానికే విజయ్ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ఏడాదికి 10 నుంచి 20 ట్రెక్కులు మాత్రమే నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరికీ పెద్దగా తెలియని కొత్త ట్రెక్కింగ్ మార్గాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలనేది తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్!


