జొమాటో కీలక నిర్ణయం.. ఆ వంటకాలపై నిషేధం! | Zomato Bans Analogue Paneer Dishes From Platform | Sakshi
Sakshi News home page

జొమాటో కీలక నిర్ణయం.. ఆ వంటకాలపై నిషేధం!

Aug 31 2026 3:10 PM | Updated on Aug 31 2026 3:30 PM

Zomato Bans Analogue Paneer Dishes From Platform

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, నకిలీ పనీర్‌తో తయారు చేసినటువంటి అనలాగ్ పాల ఉత్పత్తులను తన ప్లాట్‌ఫామ్ నుంచి నిషేధించింది. అనలాగ్ పాల ఉత్పత్తులు కలిగిన వంటకాల అమ్మకాల పట్ల తాము జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

సాధారణ పనీర్ పాలతో తయారవుతుంది. కానీ అనలాగ్ పనీర్‌ వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, ఎమల్సిఫయర్లు వంటి పదార్థాల ద్వారా తయారవుతుంది. అయితే బయటకు చూస్తే అసలైన పనీర్‌లాగే కనిపించినా, రెండింటి తయారీ విధానం మాత్రం వేరు.

రెస్టారెంట్లకు కొత్త నిబంధనలు
రెస్టారెంట్లు ఇకపై అనలాగ్ డెయిరీ ఉత్పత్తులను ఉపయోగించే వంటకాలను జొమాటోలో ఉంచకూడదు. వీలైనంత త్వరగా సహజమైన పాల ఉత్పత్తులకు మారాలని కంపెనీ సూచించింది. అంతే కాకుండా.. రెస్టారెంట్లు తమ సప్లయర్ల నుంచి వచ్చే లేబుల్స్, ఇంగ్రిడియెంట్స్‌ను చెక్ చేసి, మెనూలో సరైన వివరాలు ఇవ్వాలని తెలిపింది. నిబంధనలు పాటించని రెస్టారెంట్లను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.

అమ్మకాలపై చర్యలు
జొమాటో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. కస్టమర్లకు తాము తింటున్న ఆహారం గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వడం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఫేక్ పనీర్ తయారీ, అమ్మకాలపై చర్యలు జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ అంశంపై నిఘా కూడా పెరిగింది.

జొమాటో తీసుకున్న ఈ నిర్ణయంతో రెస్టారెంట్లు తమ ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. కస్టమర్లు కూడా తాము ఆర్డర్ చేస్తున్న వంటకంలో నిజంగా ఏ పదార్థాలు ఉపయోగిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ''కస్టమర్ తాను ఏం తింటున్నాడో అతనికి స్పష్టంగా తెలియాలి'' అనే ఉద్దేశంతో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement