హానికారక పదార్థాలుంటే ఎరుపు రంగు షడ్భుజి
సుప్రీంకోర్టుకు తెలియజేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
న్యూఢిల్లీ: అదనపు సంతృప్త కొవ్వు, అదనపు చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ల ముందు భాగంలో ఎరుపు రంగులో స్పష్టంగా కనిపించేలా హెచ్చరిక లేబుల్‌ను ముద్రించాలని ప్రతిపాదించినట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల గురించి వినియోగదారులకు సరళమైన, స్పష్టమైన, సులభంగా అర్థమయ్యే హెచ్చరికను అందించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని పేర్కొంది.
2024లో ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ జారీ చేసిన ఆహార మార్గదర్శకాల్లో పేర్కొన్న పరిమితుల ఆధారంగా.. అదనపు సంతృప్త కొవ్వు, అదనపు చక్కెర మరియు ఉప్పు వంటివి అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ముందు భాగంలో ఎరుపు రంగు షడ్భుజి ఆకారంలో ప్రముఖంగా హెచ్చరిక లేబుల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ హానికారక పదార్థాలున్న ఆహార ప్యాకెట్లపై ఈ రెండు వార్నింగ్ లేబుల్ ముద్రించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలియజేసింది. ‘3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’ అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆగస్టు 13న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.


