కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయడం, సహోద్యోగులతో మధ్యాహ్న భోజనం చేయడం, స్నేహితులతో కలిసి తినడం.. భోజనం పంచుకోవడం సాధారణ సామాజిక కార్యకలాపంగా కనిపిస్తుంది. అయితే కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక అనుబంధానికి మించిన ప్రయోజనాలు ఉంటాయా అనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. తరచుగా కలిసి భోజనం చేయడం మెరుగైన భావోద్వేగ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండొచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. తరచూ ఒంటరిగా భోజనం చేయడం డిప్రెషన్, మెదడు ఆరోగ్యంలో మార్పులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు.
ఈ భావనను కమెన్సాలిటీ అంటారు. అంటే ఇతరులతో కలిసి ఆహారం తింటూ పంచుకోవడం. ఇతరులతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడటం, సంబంధాలను పెంపొందించుకోవడం, ఒంటరితనాన్ని తగ్గించుకోవడం. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనం చేసే టేబుల్ చుట్టూ కూర్చోవడం వల్ల మాట్లాడుకోవడానికి, పరస్పరం అనుబంధం పెంచుకోవడానికి, సంబంధాలను బలపరచుకోవడానికి, ఒంటరితనం తగ్గించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్న చాలా ఆధారాలు కేవలం సంబంధాన్ని మాత్రమే చూపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒంటరిగా భోజనం చేయడం వల్లే డిప్రెషన్, డిమెన్షియా లేదా మెదడులో మార్పులు నేరుగా వస్తాయని నిరూపించలేదు.
కలిసి భోజనం చేస్తే మానసిక ఆరోగ్యం
కలిసి భోజనం చేయడం మానసిక ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో కలిసి భోజనం చేయడం, భావోద్వేగ శ్రేయస్సు మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 9,361 మంది మహిళలపై జరిగిన ఒక అధ్యయనంలో, భోజనం సమయంలో టేబుల్ చుట్టూ కూర్చునే వ్యక్తుల సంఖ్యకు డిప్రెషన్ వచ్చే ప్రమాదానికి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, వారు ఒంటరిగా నివసిస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా పరిశోధకులు ఈ సంబంధాన్ని గుర్తించారు.
జపాన్‌లో జరిగిన మరో అధ్యయనం 65 నుంచి 74 ఏళ్ల వయసున్న వ్యక్తులను పరిశీలించింది. కుటుంబంతో కలిసి నివసిస్తున్నా తరచూ ఒంటరిగా భోజనం చేసే వృద్ధుల్లో, ఇతరులతో కలిసి భోజనం చేసే వారితో పోలిస్తే డిప్రెషన్ లక్షణాలు కనిపించే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కేవలం ఒకరితో కలిసి నివసించడం వల్ల లభించే సామాజిక ప్రయోజనం, నిజంగా కలిసి సమయం గడపడం వల్ల లభించే ప్రయోజనంతో సమానం కాకపోవచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
మెదడులో ఏం జరుగుతుంది?
ఒంటరిగా భోజనం చేయడం దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉందా అనే అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2025లో జపాన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, తరచూ ఒంటరిగా భోజనం చేసే వ్యక్తుల్లో జ్ఞానపరమైన విధులకు సంబంధించిన కొన్ని మెదడు ప్రాంతాల్లో తక్కువ మెదడు పరిమాణం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో హిప్పోకాంపస్, మధ్య టెంపోరల్ లోబ్ ఉన్నాయి. హిప్పోకాంపస్ అంటే జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం వంటి విధుల్లో ముఖ్యమైన మెదడు భాగం.
మధ్య టెంపోరల్ లోబ్ అంటే జ్ఞాపకశక్తి, సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి మెదడు విధుల్లో కీలకంగా పనిచేసే ప్రాంతం.
ఆహారం కారణంగా ఈ తేడాల్లో కొంత భాగం వివరించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే ఒంటరిగా భోజనం చేసే వ్యక్తులు తక్కువ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఆహారం ఈ మొత్తం సంబంధాన్ని వివరించలేకపోయింది.
ఇదీ చదవండి: జెన్ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్‌లు ఇస్తూ


