విజయ్‌ మరో సంచలనం.. మోదీ, రాహుల్‌ తర్వాత ప్లేస్‌! | After Modi and Rahul Its Vijay: Thalapathy Emerges as Third PM Choice | Sakshi
Sakshi News home page

విజయ్‌ మరో సంచలనం.. మోదీ, రాహుల్‌ తర్వాత ప్లేస్‌!

Aug 28 2026 1:25 PM | Updated on Aug 28 2026 1:53 PM

After Modi and Rahul Its Vijay: Thalapathy Emerges as Third PM Choice

తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్‌ విజయ్‌ జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తర్వాత.. తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా టుడే–సీ ఓటర్‌ నిర్వహించిన తాజా ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ (MOTN) సర్వేలో ఈ ఆసక్తికరమైన ఫలితం వెల్లడైంది.

ప్రధాని పదవికి తదుపరి ఎంపికగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. నరేంద్ర మోదీకి 48.7 శాతం మంది, రాహుల్‌ గాంధీకి 27.1 శాతం మంది మద్దతు తెలిపారు. అనూహ్యంగా విజయ్‌కు ఏకంగా 9.2 శాతం మంది మద్దతు పలికారు. దీంతో ఆయన మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్‌ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.

విజయ్‌ తర్వాత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2 శాతంతో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ 1.7 శాతంతో, కాక్‌రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే 1.3 శాతంతో, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ 1.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆ రకంగానూ విజయ్‌కు ఆదరణే
ప్రధాని ఎంపిక ప్రశ్నతో పాటు.. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులని అడిగినప్పుడు కూడా విజయ్‌ మంచి స్థానంలో నిలిచారు. ఈ విభాగంలో రాహుల్‌ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. విజయ్‌ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5 శాతం, కేజ్రీవాల్‌ 7.5 శాతం, అఖిలేశ్‌ యాదవ్‌ 6.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

రెండేళ్లలోనే సీఎం.. ఇప్పుడేమో
విజయ్‌ 2024లో టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రెండేళ్లలోనే జరిగిన తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. తొలి ఏడాది పాలన కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల జాబితాలో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల టీవీకే నేతలు కూడా విజయ్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బహిరంగంగానే ప్రారంభించారు. 2029 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్‌ చేసే సంకేతాలు ఇస్తున్నారు.

‘దక్షిణం నుంచి ప్రధాని రావాలి’
విజయ్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా ఇటీవల జోరందుకున్నాయి. ఆగస్టు 18న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన టీవీకే మంత్రి శరత్‌కుమార్‌.. విజయ్‌ భవిష్యత్‌ ప్రధాని అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.

అంతకుముందు టీవీకే నేత, తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్‌ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావడం ఖాయమని, అలాంటి నాయకుడు తమిళనాడు నుంచి ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా వెలువడిన ఇండియాటుడే సర్వే ఫలితాలు టీవీకే వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.

25 వేల మందితో తాజా సర్వే
ఇండియా టుడే గ్రూప్‌ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేలో భాగంగా తాజా సర్వేను సీ ఓటర్‌ నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్‌ నిర్వహించిన సాధారణ ట్రాకింగ్‌ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా, కూటమిగా మార్చుకోవడం విజయ్‌కు పెద్ద సవాలే. అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన నాయకుడిగా కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించే స్థాయికి విజయ్‌ చేరుకోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి: దటీజ్‌ విజయ్‌.. తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement