గల్లీ టు గ్లోబల్..
‘మిసల్’ అంటే మరాఠీ భాషలో ‘కలయిక‘ అని అర్థం. 20వ శతాబ్దం ప్రారంభంలో మహారాష్ట్రలోని ఖాందేశ్, నాసిక్ ప్రాంతాల్లోని రైతులు, రోజువారీ కూలీల కోసం ఈ వంటకం పుట్టుకొచ్చింది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ శక్తినిచ్చే ఆహారం కావడంతో... ఇళ్లలో మిగిలిపోయిన ఉడకబెట్టిన పెసళ్లు, శనగలు, మసాలా రసం, చుట్టూ దొరికే కరకరలాడే స్నాక్స్‌ను కలిపి ఒక డిష్‌గా అందించడం ప్రారంభించారు. అలా మిసల్ పావ్ వంటకం ప్రజలందరికీ ఇష్టమైన వంటకంగా మారిపోయింది.
మహారాష్ట్ర వీధుల్లో ఎక్కడ చూసినా కనిపించే ‘మిసల్ పావ్’ కేవలం ఒక టిఫిన్ మాత్రమే కాదు... పుణె సంస్కృతిలో భాగమైన ఒక ఎమోషన్. ఘాటైన కారం, కరకరలాడే ఫర్సాన్, ఉడకబెట్టిన మొలకెత్తిన ధాన్యాలు, వేడివేడి పావ్‌ల కాంబినేషన్ ప్రతి ఒక్కరి నాలుకపై నీరూరిస్తుంది. ఒకప్పుడు పేద ప్రజలు, కూలీల ఆకలి తీర్చడానికి మొదలైన ఈ మిసల్ పావ్... నేడు పుణె సిటీలోనే అత్యంత ఐకానిక్ డిష్‌గా మారిపోయింది.
తక్కువ ధరలో లభించే పోషకాహారం కావడంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, పర్యాటకులు మిసల్ పావ్ రుచికి దాసోహమయ్యారు. నేడు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాకాహార అల్పాహారాల్లో ఒకటిగా లండన్‌లో గుర్తింపు పొందే స్థాయికి మిసల్ పావ్ ఎదిగింది. షాపుల ముందు మైళ్ల పొడవునా క్యూ నిలబడినా సరే... పొగలు కక్కే మిసల్ పావ్ తింటే వచ్చే ఆ తృప్తి ముందు ఆ నిరీక్షణ చిన్నబోతుందంటారు పుణె వాసులు.
ఇవీ చదవండి: ఆఫీస్ వర్క్‌లో ఫోకస్ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్ తప్పనిసరి!


