ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
కిడ్స్
కథ
ఒక చిన్న గ్రామంలో రాము, అతని పదేళ్ల కూతురు చైత్ర నివసిస్తున్నారు. రాముకు చదువు రాదు. ఊళ్లో చిన్న కిరాణా కొట్టు నడుపుతుంటాడు. కానీ, అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది. రోజంతా సంపాదించిన డబ్బుతో సాయంత్రం కాగానే స్నేహితులతో కలిసి పేకాట ఆడుతూ కూతురు చదువు గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు.
కానీ చైత్ర చాలా చురుకైన పిల్ల. ఎలాగైనా చదువుకుని గొప్ప ఆఫీసర్ అవ్వాలని, నాన్నను మార్చాలని అనుకునేది. ఒకరోజు రాము పేకాటలో ఓడిపోయి, ఇంటికి వచ్చాడు. చైత్ర చేతిలో ఒక స్టాంప్ కాగితం పెట్టి, ‘చైతూ.. ఇందులో ఏముందో చదువు. మా స్నేహితుడు దీనిపై సంతకం పెడితే వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు‘ అన్నాడు. చైత్ర ఆ కాగితం చదివి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది వాళ్ల కిరాణా కొట్టును ఆ స్నేహితుడికి రాసిచ్చే పత్రం!
చైత్ర నాన్న చేతులు పట్టుకుని, ‘నాన్న! చదువుకోకపోతే సమాజం మనల్ని ఎలా మోసం చేస్తుందో చూశావా? నువ్వు సంతకం పెడితే మనకున్న ఒకే ఒక్క ఆధారం పోయేది. నువ్వు మారాలి నాన్న‘ అంటూ ఏడ్చేసింది. రాముకు ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నాయి. ఆ రోజు నుంచి రాము పేకాట మానేశాడు. ప్రతి సాయంత్రం చైత్ర పక్కన కూర్చుని, కూతురి దగ్గరే అక్షరాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కూతురిని బాగా చదివించాడు. కొన్నేళ్ల తర్వాత చైత్ర పెద్ద ఆఫీసర్ అయ్యింది. ఆ రోజు రాము అందరితో, ‘నన్ను దారికి తెచ్చిన నా గురువు నా కూతురే‘ అని గర్వంగా చెప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి: నిచ్చెన ఎక్కేప్పుడు కాళ్లు ఎందుకు వణుకుతాయి?


