నేపాల్‌ను ముంచిన బురద సునామీ! | Himalayan Glacier Collapse Causes Massive Mudflow Nepal Border | Sakshi
Sakshi News home page

నేపాల్‌ను ముంచిన బురద సునామీ!

Aug 29 2026 9:17 AM | Updated on Aug 29 2026 9:24 AM

Himalayan Glacier Collapse Causes Massive Mudflow Nepal Border

పర్యావరణ విపత్తు

పిల్లలూ... ఆగస్టు 26 ఉదయం నేపాల్‌ సరిహద్దుల్లో ఒక భయంకరమైన ప్రకృతి వింత జరిగింది. హిమాలయ పర్వతాల పైన ఉండే భారీ ఐస్‌ గ్లేసియర్‌ (మంచు కొండ) ముక్కలై కింద పడింది! భూమి వేడెక్కడం వల్ల ‘లాంగ్తాంగ్‌ లిరుంగ్‌’ అనే ఎత్తైన కొండ దగ్గర ఉన్న మంచు పర్వతం బలహీనపడి, ఒక్కసారిగా విరిగిపోయి వందల మీటర్ల కింద ఉన్న లెండే ఖోలా నదిలోకి కూలిపోయింది.

అంత పెద్ద మంచు కొండ కింద పడేసరికి వచ్చిన ప్రకంపనలు రిక్టర్‌ స్కేలుపై 5.2 తీవ్రత ఉన్న భూకంపం లాగా రికార్డయ్యాయి. దాంతో ప్రజలంతా భూకంపం వచ్చిందేమో అనుకుని ఇళ్లలోనే ఉండిపోయారు, కానీ పైనుంచి ప్రమాదం వస్తోందని ఊహించలేకపోయారు.

వేల అడుగుల ఎత్తు నుంచి అంత పెద్ద మంచు కొండ కింద పడటంతో పుట్టిన ఘర్షణ వేడికి ఆ మంచు ముక్కలన్నీ క్షణాల్లో కరిగిపోయి నీళ్లలా మారాయి. ఆ నీరు పర్వతం మీది నుంచి కిందికి వస్తున్నప్పుడు దారిలో ఉన్న మట్టి, ఇసుక, పెద్ద పెద్ద బండరాళ్లను కూడా తనతో పాటు లాక్కొచ్చేసింది. దాంతో నదిలోని నీళ్లు మనం ఇళ్లు కట్టేటప్పుడు సిమెంట్, ఇసుక కలిపిన ‘లిక్విడ్‌ కాంక్రీట్‌‘ లాంటి భయంకరమైన బురద ప్రవాహంగా మారిపోయాయి.

ఈ బురద ప్రవాహం చాలా బరువైంది, వేగమైంది. ఇది నదిలోకి దూసుకొచ్చిన కేవలం 30 నిమిషాల్లోనే నది నీటి మట్టం 30 అడుగుల పైకి లేచింది. పైగా ఇలాంటి మంచు కొండలు ఎప్పుడు విరిగిపడతాయో ముందుగా ఊహించడం శాస్త్రవేత్తలకు కూడా చాలా కష్టం. దాంతో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం, బురద విపరీతమైన వేగంతో రావడం వల్ల జనం ప్రాణాలు కాపాడుకునే సమయం లేకుండా పోయింది. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ ’మంచు సునామీ’ మనకు నేర్పుతోంది!

ఇవీ చదవండి: నేపాల్‌లో ఆగని మృత్యుఘోష 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement