breaking news
Kids specials story
-
గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా?
ఒక అడవికి రాజు సింహం. సింహం అంటేనే గజగజలాడే భయం. కానీ, ఇప్పుడు ఆ మృగరాజు ఒక చీకటి గుహలో దీనంగా పడి ఉంది. కొద్దిరోజుల కిందటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక క్రూరమైన పులితో చేసిన పోరాటంలో సింహం తీవ్రంగా గాయపడింది. ఆ గాయాలు మానినా, ఆనాటి భయంకరమైన దృశ్యాలు సింహం మనసును వదలడం లేదు.రాజవైద్యుడైన ఎలుగుబంటి ఎన్ని ఔషధాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. సింహం నిరాశతో, ‘నా పరాక్రమం ముగిసింది మిత్రమా! ఈ గాయాలే నా మరణానికి దారి తీస్తాయి. నేను మళ్ళీ గర్జించలేను.’ అంటూ నిట్టూర్చింది.అదే సమయంలో, పొరుగు అడవి నుంచి తన మిత్రుడైన ఏనుగును కలవడానికి ఒక కోతి వచ్చింది. ఏనుగు తన రాజు ఆరోగ్య పరిస్థితిని వివరించగా, అంతా విన్న కోతి గంభీరంగా ఇలా అంది: ‘మిత్రమా! మృగరాజుకు ఇప్పుడు కావాల్సింది మూలికల వైద్యం కాదు, మానసిక వైద్యం!’ఏనుగు ఆశ్చర్యపోయి, ‘వైద్యం గురించి నీకు ఇవన్నీ ఎలా తెలుసు?’ అని అడిగింది. అప్పుడు కోతి తన గతాన్ని వివరిస్తూ, ‘నేను ఒకప్పుడు గొప్ప వైద్యురాలిని. కానీ, ఒక చిన్న పొరపాటు వల్ల ఒక జీవి ప్రాణం పోయింది. ఆ అపరాధ భావంతో అప్పటి నుండి వైద్యం చేయడమే మానేశాను. ఎవరికీ ఈ విషయం చెప్పలేదు.’ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది.ఏనుగు వెంటనే కోతి భుజంపై తొండం వేసి, ‘మిత్రమా! గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మన పొరపాట్ల నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు సింహాన్ని కాపాడటం నీ బాధ్యత. నీలో నిద్రాణమైన వైద్యుడిని నిద్రలేపు!’ అని ప్రోత్సహించింది.ఏనుగు మాటలతో కోతిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కోతి, ఏనుగు కలిసి సింహం గుహకు వెళ్లాయి. అవి రాజవైద్యుడు ఎలుగుబంటికి విషయం చెప్పాయి. ఎలుగుబంటి సంబరపడి, మృగరాజుకు వైద్యం చేయటానికి కోతిని అనుమతించింది. కోతి సింహాన్ని పూర్తిగా పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనకు కావలసిన మూలికలు సేకరించడానికి గుహ బయటకు వెళ్ళింది.ఆ సమయంలో ఏనుగు ఇలా అంది: ‘మృగరాజా! గతం గతః. మీ పరాక్రమాన్ని మళ్ళీ చాటే సమయం వచ్చింది. ఈమె సామాన్యమైన కోతి కాదు, గొప్ప వైద్యురాలు.’మూలికలు సేకరించి తిరిగి గుహలోకి వచ్చిన కోతి, సింహం కళ్ళలోకి సూటిగా చూస్తూ, ‘రాజా! మీ వ్యాధి మీ దేహంలో లేదు, మీ ఆలోచనల్లో ఉంది. నాడు మీరు పులిని తరిమికొట్టినప్పుడు తగిలిన ఈ గాయాలు మీ వీరత్వానికి సజీవ సాక్ష్యాలు! అవి మిమ్మల్ని భయపెట్టకూడదు, మీ గుండెను మరింత బలంగా మార్చాలి.’ అని నొక్కి చెప్పింది. అనంతరం మూలికలతో ఒక లేహ్యం తయారుచేసి సింహానికి తాగించింది.ఆశ్చర్య కరంగా, మరుసటి రోజు ఉదయానికే మృగరాజు తన నిస్సత్తువను వదిలి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జించాడు! నిజానికి కోతి ఇచ్చిన ఆ ‘మందు’ కేవలం తీపి పండ్ల రసం మాత్రమే. సింహం రోగం నయం కావడానికి కారణం ఆ రసం కాదు; కోతి తన మనసులో నింపిన ధైర్యం, గతాన్ని మర్చిపోవాలనే సంకల్పం మాత్రమే!సింహం తన తప్పు తెలుసుకుంది. ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందని గ్రహించింది. తనను మళ్ళీ కర్తవ్యోన్ముఖుడిని చేసిన కోతిని ఘనంగా సత్కరించి, తన ఆస్థాన వైద్యురాలిగా నియమించుకుంది. అలాగే కోతిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఏనుగును తన రాజ సలహాదారునిగా నియమించుకుంది. రాజవైద్యుడు ఎలుగుబంటి కూడా వారి సమయస్ఫూర్తిని చూసి మురిసిపోయాడు.హితవచనం..అసంవిభాగీ దుష్టాత్మా కృతఘ్నో నిరపత్రపఃతాదృగ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిపఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వనివాడు, దుష్టబుద్ధి, కృతజ్ఞత లేనివాడు, సిగ్గులేనివాడు అయిన రాజును పరిత్యజించాలి.- ముద్దు హేమలతఇవీ చదవండి: బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా? -
ఒక్క చెట్టు 4,000 పండ్లు.. ఈ చెట్టు కథ విన్నారా?
జపాన్‌లో ఒక ఊరు ఉంది. ఆ ఊరంతా పియర్ చెట్లే! ఆ ఊరి పేరు టొట్టోరి. అక్కడ ఇంటి ముందు, బడి ముందు, రోడ్ల పక్కన అంతా పియర్ చెట్లే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? టొట్టోరి కొండ వాలు ఊరు. వర్షం పడితే నీళ్లు నిలవకుండా వెళ్లిపోతాయి.ఇలాంటి చోటు పియర్ చెట్లకు చాలా ఇష్టం. భలే పెరుగుతాయి. అందుకే ఇక్కడ పండ్లు ఎంతో జ్యూసీగా, తియ్యగా పండుతాయి. టొట్టోరి రైతులు పియర్ చెట్లను చాలా ప్రేమగా చూసుకుంటారు. అక్కడ ఒక పెద్ద పియర్ చెట్ల మ్యూజియం కూడా ఉంది. అందులో 20 మీటర్ల వెడల్పున్న ఒక పెద్ద చెట్టు ఉంది.అది ఒక్కటే ఏడాదికి 4000 పండ్లు ఇస్తుంది! అందుకే టొట్టోరిలో కొత్త సీజన్ వస్తే మొదటి పియర్ బాక్స్ లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. ఆగస్టు 27న ఒసాకా నగరంలో మొదటి పియర్ పండ్ల వేలం జరిగింది. 10 కిలోల ఒక బాక్స్ పండ్లు ఏకంగా 6,00,000 యెన్లు అంటే మన లెక్కలో దాదాపు 3 లక్షల 40 వేల రూపాయలకు అమ్ముడుపోయింది! ఇది రికార్డ్.ఇవీ చదవండి: కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా? -
కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా?
ఈ ఫోటోలో అంకుల్ని చూశారా? చిన్న పిల్లాడిలా మూడు చక్రాల సైకిల్ మీద దూసుకు΄ోతున్నాడు. పైగా అతను సైకిల్ తొక్కడం లేదు, కొండ మీద నుంచి జారుతున్నాడు. ఈ వింత రేసు కొలంబియా దేశం, మెడలిన్ నగరంలో జరిగింది.ప్రతి సంవత్సరం జరిపే దీని పేరు ‘వాలు పండుగ’. కొండ వాలు మీద సొంతగా తయారు చేసుకున్న ఇంజన్ లేని బండ్లు, తొక్కనవసరం లేని సైకిళ్లతో రేసులో పాల్గొనాలి. ఈ ఊళ్లో పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారని వాళ్లకు వ్యాపకం కోసం ఇలా బండ్లు తయారు చేయమంటారు.పిల్లలు తమ చేతులతోనే చెక్కతో, ఇనుముతో ఈ ముచ్చటైన బుడ్డి బండ్లను తయారు చేస్తారు. వాటితో రేసు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. ఈ రేసు ఉద్దేశం భయాన్ని గెలవడం. కొండ అంటే భయం కాదు, సరదా అని చెప్పడం. ఇంజిన్ లేదు, పెట్రోల్ లేదు. ఉన్నదల్లా ధైర్యం, స్నేహితుల చప్పట్లు. అవి చాలు కదా గెలవడానికి.ఇవి కూడా చదవండి: చిన్నారి జాలి చూపితే.. కుక్క ప్రాణం కాపాడింది! -
చిన్నారి జాలి చూపితే.. కుక్క ప్రాణం కాపాడింది!
లక్ష్మి నాలుగో క్లాసు. వరంగల్ దగ్గర ఒక చిన్న పల్లె వాళ్ల ఊరు. వాళ్ల ఇంటి వెనుక వరి పొలం ఉంది. ఒకరోజు వర్షం పడుతుండగా పొలం గట్టు మీద ఒక కుక్కపిల్ల వణుకుతూ కనిపించింది. నల్లగా, చిన్నగా, చెవులు వేలాడుతూ ఉన్న కుక్కపిల్ల. లక్ష్మికి జాలి వేసింది. వానలో తడుస్తూ వెళ్లి ఆ కుక్కపిల్లను ఇంటికి తెచ్చి ‘బుజ్జి’ అని పేరు పెట్టింది.లక్ష్మి తల్లి దానిని ఒక పాత గుడ్డతో తుడిచి, వేడి పాలు ఇచ్చింది. అప్పటి నుంచి లక్ష్మి, బుజ్జి విడదీయరాని స్నేహితులయ్యారు. లక్ష్మి స్కూల్‌కి వెళ్తే బుజ్జి గేటు దగ్గరే కూర్చునేది. సాయంత్రం ఇద్దరూ కలిసి పొలంలో ఆడుకునేవారు. లక్ష్మి పుస్తకం చదువుతుంటే బుజ్జి పక్కన పడుకుని వినేది.ఒకరోజు లక్ష్మి పొలంలో ఆడుతూ జారి చిన్న కాలువలో పడింది. నీళ్లు వేగంగా లాగుతున్నాయి. లక్ష్మి ‘అమ్మా!’ అని అరిచింది. ఎవరూ లేరు. బుజ్జి ఒక్క ఉదుటున పరిగెత్తి ఇంటికి వెళ్లి లక్ష్మి తల్లి చీర పట్టుకుని లాగింది. తల్లి ఏదో జరిగిందని పరిగెత్తింది. చూస్తే లక్ష్మి కాలువలో కొట్టుకు΄ోతోంది. తల్లి వెంటనే కాలువలో దిగి లక్ష్మిని బయటకు లాగింది. ఆ రోజు నుంచి ఊరంతా బుజ్జిని ‘హీరో బుజ్జి’ అని పిలిచేవారు. నిజమైన స్నేహానికి మాటలు అక్కర్లేదు, ప్రేమ చాలు.ఇవి కూడా చదవండి: ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా? -
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
హాయ్ ఫ్రెండ్స్! ఫొటోలో ఉన్న ముద్దుముద్దు పక్షులను చూశారా? నలుపు–తెలుపు కోటు, ఎర్రటి ముక్కు, నారింజ రంగు కాళ్లతో పెంగ్విన్‌లా ఉన్నాయి కదా? వీటి పేరు పఫిన్. వీటిని సముద్రపు చిలుకలు అని కూడా పిలుస్తారు.ఈ ఫోటో ఐస్‌ల్యాండ్ లోని వెస్ట్మన్నేయర్ దీవుల్లో తీసింది. అక్కడ ఆగస్టు నెలలో ఉష్ణోగ్రత కేవలం 12 డిగ్రీలే! అయినా పిల్లలకు అదే పెద్ద వేసవి. ఎందుకంటే అక్కడ రోజుకు 18 గంటలు సూర్యుడు ఉంటాడు. మరి ఈ పఫిన్లు ఎందుకు అక్కడికి వస్తాయి? గుడ్లు పెట్టడానికి. ఇవి చెట్లపై గూడు కట్టవు. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా పచ్చటి కొండ అంచున బొరియలు తవ్వి ఇల్లు చేసుకుంటాయి.ఒక బొరియలో ఒకే ఒక్క గుడ్డు పెడుతుంది. ఈ పక్షులకు ఒక సూపర్ పవర్ ఉంది. ఒకేసారి 10 చేపలను ముక్కుతో పట్టుకోగలదు. పిల్లల కోసం అలా చేపలు తెస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు, 60 మీటర్ల లోతు వరకు నీటిలో దూకి ఈదగలదు. ఈ సందడి ఆగస్టు చివరి వరకే. సెప్టెంబర్ రాగానే ఇవన్నీ మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. మళ్ళీ వచ్చే ఏప్రిల్ వరకు కనిపించవు. అందుకే ఈ ఫొటో చాలా స్పెషల్. మీకు తెలుసా? పఫిన్ ముక్కు వేసవిలో మాత్రమే ఎర్రగా మారుతుంది. చలికాలం వస్తే మళ్ళీ బూడిద రంగులోకి మారిపోతుంది.నిర్వహణ: కెఇవి కూడా చదవండి: మన కుల్ఫీ ముందు ప్రపంచ డెసర్ట్లు సైతం ఫిదా! -
‘చిన్న ముల్లుకే ఏడుస్తావా?’.. కోతికి చివర్లో దిమ్మతిరిగే గుణపాఠం!
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా తుంటరిది. ఎప్పుడూ చెట్ల మీద గంతులు వేస్తూ అడవిలో ఉన్న జంతువులను వెక్కిరిస్తూ ఉండేది. ఏవైనా జంతువులు కష్టంలో ఉంటే సహాయం చేయకపోగా, వాటిని ఎగతాళి చేస్తూ కాలక్షేపం చేసేది.ఒకరోజు కోతి విహారానికి నడుచుకుంటూ వెళుతుండగా, దారిలో ఒక ఎలుగుబంటికి కాలికి ముల్లు గుచ్చుకొని బాధపడుతూ కనిపించింది. ఎలుగుబంటి ఆ ముల్లును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడుతోంది. అది చూసిన కోతి, ‘ఛీ! ఇంత చిన్న ముల్లుకి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చాలా పిరికిదానివి!’ అని ఎలుగుబంటిని చూసి ఎగతాళి చేసింది. ఎలుగుబంటి బాధగా, ‘ఇది నీకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, నొప్పి ఎలా ఉంటుందో తెలిస్తే ఇలా అనవు!’ అని అక్కడి నుండి కుంటుతూ వెళ్లిపోయింది. కోతి మాత్రం నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.దారిలో ఒక ఏనుగు గుండ్రంగా తిరుగుతూ, తొండాన్ని ఊపుతూ కనిపించింది. తొండానికి తేలు కుట్టడంతో ఏనుగు నొప్పిని భరించలేక అల్లాడిపోతోంది. అప్పుడు అక్కడికి వచ్చిన కోతి, ‘ఏంటీ? ఒక చిన్న తేలు కుడితేనే కొండలా ఉన్న నువ్వు ఇంతలా విలవిల్లాడిపోతున్నావా? నేనైతే అస్సలు పట్టించుకోను. నువ్వు ఎంత పిరికి దానివి!’ అని ఏనుగును కూడా వెక్కిరించింది. కోతి మాటలకు ఏనుగు ఎంతో బాధపడింది. ఏనుగు బాధను చూసి కోతి ఏమాత్రం కనికరించకుండా తన దారిలో వెళ్ళిపోయింది.మరో రోజు, ఒక నెమలి వర్షంలో తడిసి రెక్కలు బరువెక్కడంతో ఎగరలేక కిందపడి ఇబ్బంది పడుతుంటే, కోతి చెట్టు మీద నుండి పండ్లు విసురుతూ, ‘పురివిప్పి నాట్యం చేయలేని నెమలి దేనికీ పనికిరాదు. రెక్కలు మొద్దుబారిన నువ్వు అడవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే!’ అని వెక్కిరించింది. ఇలా ఎదుటివారి బాధను చూసి కోతి ప్రతిసారీ నవ్వుకుంటూనే ఉండేది.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు కోతి చెట్టు మీద నుండి కిందకు దూకుతుండగా, ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వలలో ఉన్న పదునైన ఇనుప ముళ్లు కోతి కాలికి, తోకకు బలంగా గుచ్చుకున్నాయి. కోతి నొప్పి తట్టుకోలేక, ‘అమ్మో! ఎంత నొప్పి! ఎవరైనా నన్ను కాపాడండి! నేను భరించలేకపోతున్నాను!’ అని పెద్దగా అరుస్తూ ఏడవసాగింది.కోతి అరుపులు దూరంగా ఉన్న ఏనుగుకి, ఎలుగుబంటికి, నెమలికి వినిపించాయి. అవి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. కోతి తన కాలికి ముళ్లు గుచ్చుకుని, విలవిల్లాడుతుండటం చూశాయి.అప్పుడు కోతికి అర్థమైంది, ఎదుటివారి బాధను తక్కువ చేసి మాట్లాడటం తప్పు అని. ఎలుగుబంటి, ఏనుగు, నెమలి అన్నీ కలిసి కోతి దగ్గరకు వచ్చాయి. ఆ జంతువులన్నింటినీ చూసి కోతి కళ్లు చెమ్మగిల్లాయి. ఎలుగుబంటి, ఏనుగు జాగ్రత్తగా వల నుండి కోతిని విడిపించి, ఆ ముళ్లను తొలగించి దానికి సహాయం చేశాయి.తను చేసిన తప్పుకు చాలా సిగ్గుపడింది కోతి. ‘మిమ్మల్ని ఇంతకుముందు నేను ఎంతగానో ఆటపట్టించాను. కానీ, మీరు ఇప్పుడు నాకు సహాయం చేశారు. ఎవరి బాధ ఎంతటిదో, అది మనదాకా వస్తేనే తెలుస్తుంది!’ కన్నీళ్లతో అంది కోతి. అప్పటి నుండి కోతి ఏ జంతువునూ తక్కువ చేసి మాట్లాడలేదు. ‘ఎదుటివారి కష్టాన్ని చూసి నవ్వడం కంటే, ఆదుకోవడం మిన్న!’ అని తెలుసుకుంది. హితవచనం..అపకృత్య బుద్ధిమతో దూరస్థోస్మీతి నాశ్వసేత్దీర్ఘా బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః - బుద్ధిమంతుడికి అపకారం చేసి, దూరంగా పారిపోయి, ‘అతడికి దూరంగానే ఉన్నాను కదా, నాకేం భయంలేదు’ అనుకోవడం బుద్ధితక్కువ పని. బుద్ధిమంతుడు తనను హింసించినవాడు ఎక్కడున్నా పట్టుకుని, ప్రతీకారం తీర్చుకోగలడు.- శోభా సురేష్ -
వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ!
మీరు పేపర్ మీద బొమ్మ వేస్తారు కదా? మరి వరి పొలంలోనే బొమ్మ వేస్తే? ఇది చైనాలో వరిపొలం. అక్కడ రైతులు వరి మొక్కలతోనే పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు. దీన్ని ‘ప్యాడీ ఆర్ట్’ లేదా ’టాన్బో ఆర్ట్’ అంటారు. అసలు ఈ ఆర్ట్ జపాన్ లో మొదలైంది, ఇప్పుడు చైనాలో సూపర్ ఫేమస్.ఈ ఫోటోలోని అమ్మాయి జుట్టు, చీర, వాయిద్యం అన్నీ వరి మొక్కలే! కింద నుంచి చూస్తే పొలం మామూలుగా ఉంటుంది. టవర్ మీద జనం ఎక్కి చూస్తేనే బొమ్మ కనిపిస్తుంది. అందుకే దీన్ని 3డి పెయింటింగ్ అంటారు.రంగు ఎలా వస్తుంది? మనకు తెల్ల బియ్యం ఉన్నట్టే, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, ఊదా బియ్యం కూడా ఉంటాయి. వాటి ఆకులు కూడా అదే రంగులో ఉంటాయి. ఆకుల్లో ‘ఆంథోసైనిన్’ అనే సహజ రంగు ఉంటుంది. రైతు ఏ చోట ఏ రంగు కావాలో, ఆ చోట ఆ రంగు విత్తనం నాటుతాడు. మొక్కలు పెరిగేకొద్దీ బొమ్మ పెద్దదవుతుంది!ఈ ఆర్ట్ చైనాలో షెన్యాంగ్ నగరంలో చాలా ఫేమస్. అక్కడ ‘రైస్ డ్రీమ్ పార్క్’ అనే పెద్ద పార్క్ ఉంది. అక్కడి రైతులు ప్రతి ఏడాది 13 హెక్టార్లలో 17 పెద్ద బొమ్మలు వేస్తారు. మొక్కల ఎత్తును కూడా కంట్రోల్ చేసి 3డి ఎఫెక్ట్ తెస్తారు. రైతు అంటే అన్నం పండించేవాడే కాదు, ఆర్టిస్ట్ కూడా! మనం కూడా మన పొలంలో బతుకమ్మ బొమ్మ వేయొచ్చు కదా!- నిర్వహణ: కెఇవీ చదవండి: గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్ సాహసం! -
నేపాల్‌ను ముంచిన బురద సునామీ!
పిల్లలూ... ఆగస్టు 26 ఉదయం నేపాల్ సరిహద్దుల్లో ఒక భయంకరమైన ప్రకృతి వింత జరిగింది. హిమాలయ పర్వతాల పైన ఉండే భారీ ఐస్ గ్లేసియర్ (మంచు కొండ) ముక్కలై కింద పడింది! భూమి వేడెక్కడం వల్ల ‘లాంగ్తాంగ్ లిరుంగ్’ అనే ఎత్తైన కొండ దగ్గర ఉన్న మంచు పర్వతం బలహీనపడి, ఒక్కసారిగా విరిగిపోయి వందల మీటర్ల కింద ఉన్న లెండే ఖోలా నదిలోకి కూలిపోయింది.అంత పెద్ద మంచు కొండ కింద పడేసరికి వచ్చిన ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత ఉన్న భూకంపం లాగా రికార్డయ్యాయి. దాంతో ప్రజలంతా భూకంపం వచ్చిందేమో అనుకుని ఇళ్లలోనే ఉండిపోయారు, కానీ పైనుంచి ప్రమాదం వస్తోందని ఊహించలేకపోయారు.వేల అడుగుల ఎత్తు నుంచి అంత పెద్ద మంచు కొండ కింద పడటంతో పుట్టిన ఘర్షణ వేడికి ఆ మంచు ముక్కలన్నీ క్షణాల్లో కరిగిపోయి నీళ్లలా మారాయి. ఆ నీరు పర్వతం మీది నుంచి కిందికి వస్తున్నప్పుడు దారిలో ఉన్న మట్టి, ఇసుక, పెద్ద పెద్ద బండరాళ్లను కూడా తనతో పాటు లాక్కొచ్చేసింది. దాంతో నదిలోని నీళ్లు మనం ఇళ్లు కట్టేటప్పుడు సిమెంట్, ఇసుక కలిపిన ‘లిక్విడ్ కాంక్రీట్‘ లాంటి భయంకరమైన బురద ప్రవాహంగా మారిపోయాయి.ఈ బురద ప్రవాహం చాలా బరువైంది, వేగమైంది. ఇది నదిలోకి దూసుకొచ్చిన కేవలం 30 నిమిషాల్లోనే నది నీటి మట్టం 30 అడుగుల పైకి లేచింది. పైగా ఇలాంటి మంచు కొండలు ఎప్పుడు విరిగిపడతాయో ముందుగా ఊహించడం శాస్త్రవేత్తలకు కూడా చాలా కష్టం. దాంతో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం, బురద విపరీతమైన వేగంతో రావడం వల్ల జనం ప్రాణాలు కాపాడుకునే సమయం లేకుండా పోయింది. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ ’మంచు సునామీ’ మనకు నేర్పుతోంది!ఇవీ చదవండి: నేపాల్‌లో ఆగని మృత్యుఘోష -
వానదేవుడి చిరునవ్వు
పులిచెర్ల పల్లెలో నెలరోజులుగా వాన జాడే లేదు. పొలాలు బీళ్లు వారాయి. రైతు రామయ్య తాత దిగులుగా గట్టు మీద కూర్చున్నాడు. ‘ఈ ఏడు విత్తనాలు మొలకెత్తేలా లేవు‘ అని నిట్టూర్చాడు. అది చూసిన చిన్నారి గౌరికీ, చిన్నోడుకు ఒక ఆలోచన వచ్చింది.‘వానదేవుడు మనల్ని మర్చిపోయాడేమో. మనమే పిలవాలి’ అంది గౌరి. పిల్లలందరూ కలిశారు. వానదేవుడికి ఉత్తరం రాశారు. ‘దేవుడా, మా తాతలు ఏడవొద్దు. నువ్వు నవ్వితే చాలు, మా పొలం పచ్చగా నవ్వుతుంది.’ ఆ ఉత్తరాన్ని అరటి ఆకులో పెట్టి, చెరువు గట్టున ఉన్న రావిచెట్టు తొర్రలో దాచారు. తర్వాత ఊరంతా తిరిగి వాన పాటలు పాడారు.‘ఎలుకమ్మ ఎలుకమ్మ ఎండలేలా... వానమ్మ వానమ్మ వచ్చెయ్యమ్మా...‘ పిల్లల పాటలు, వాళ్ల మంచి మనసు చూసి వానదేవుడికి ముచ్చటేసింది. ఆ రోజు సాయంత్రమే ఆకాశంలో మబ్బులు ముసిరాయి. మెరుపులు మెరిశాయి. టప్‌టప్‌మంటూ చినుకులు పడ్డాయి. రామయ్య తాత ఆనందంతో గెంతాడు. ‘చూడండి, పిల్లల మనసు వానదేవుడికి నచ్చింది!’ పొలాలన్నీ తడిశాయి. విత్తనాలు మొలకెత్తాయి. ఊరంతా పచ్చగా నవ్వింది.నీతి: చిన్నారుల స్వచ్ఛమైన ప్రేమకు, ఐక్యతకు దేవుళ్లు కూడా తలవంచుతారు. -
రెక్కల రాకెట్: ఎవరెస్ట్ దాటిన బాతు!
పిల్లలూ, మీకో సూపర్ పక్షి కథ చెప్పనా? ఊపిరి ఆడని ఎత్తులో, వణికించే చలిలో, ఎవరెస్ట్ పైనుంచి టప్ అని దూకేసే బాతు గురించి! బార్ హెడెడ్ గూస్. ‘చారల తల బాతు’ అని కూడా అనొచ్చు. తల మీద రెండు నల్ల చారలు. అదే దీని గుర్తు. రాకెట్లా ఎవరెస్ట్ శిఖరం పై నుంచి అంటే తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో హాయిగా ఎగురుతుంది. మనకు అక్కడ ఊపిరి ఆడదు. దీనికి మాత్రం అది రాజమార్గం!ఎందుకు అంత కష్టపడుతుంది?చలికాలం వస్తే మంగోలియా, టిబెట్‌లో పూర్తిగా మంచు. తినడానికి గడ్డిపోచ కూడా దొరకదు. అందుకే సెప్టెంబర్ వచ్చిందంటే చాలు, ‘పదండి ఇండియా యాత్ర వెళ్దాం’ అని ఐదు వేల మంది నేస్తాలతో బయల్దేరుతుంది ఈ బాతు. మధ్యలో హిమాలయాలు అడ్డొస్తే? ‘దాటేద్దాం పద’ అని పైనుంచి వెళ్లిపోతుంది. దీనివి గొప్ప ఊపిరితిత్తులు. మనకన్నా మూడు రెట్లు ఎక్కువ గాలిని పీల్చుకుంటుంది. బలమైన గుండె. నిమిషానికి నాలుగు వందల సార్లు కొట్టుకుంటుంది. కొండల మధ్య, లోయల మధ్య పైకి కిందికి ఊగుతూ శక్తిని పొదుపు చేస్తుంది.ప్రపంచంలోనే గొప్పది... ‘ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి’ అని దీనికి పేరుంది. శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఎనిమిది గంటల్లో హిమాలయాలు దాటేసింది. కాబట్టి నెక్స్ట్ టైమ్ ‘‘నేను చేయలేను’’ అనిపిస్తే ఈ చారల తల బాతుని గుర్తు తెచ్చుకోండి. రెక్కలు లేకపోయినా పర్లేదు, గుండె ధైర్యం ఉంటే చాలు. -
భయం వేస్తే వీపు తట్టేదెందుకో తెలుసా?
సడన్‌గా మనం భయపడినప్పుడు అమ్మో, నాన్నో వచ్చి వీపు తడతారు కదా. ఎందుకో తెలుసా? మన వీపు మీద చాలా సున్నితమైన నరాలు ఉంటాయి. పెద్దలు తట్టినప్పుడు ఆ నరాలు మెదడుకు కబురు పంపిస్తాయి... ‘భయపడకు, నీ పక్కన నీవాళ్లు ఉన్నారు’ అని.ఆ సిగ్నల్ రాగానే మన మెదడు ‘సేఫ్’ అని ఫీల్ అవుతుంది. భయం వేస్తే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీపు మీద లయగా తడితే ఆ తట్లు గుండెకి ‘మెల్లగా కొట్టుకో’ అని మెసేజ్ చేస్తాయి. డాక్టర్లు దీన్ని ‘టచ్ థెరపీ’ అంటారు.పూర్వం అడవిలో మనుషులు గుంపులుగా తిరిగేవాళ్లు. క్రూరమృగాలు తమను పసిగట్టకుండా మెల్లగా నడిచేవారు. అప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తే పెద్దవాళ్లు వీపు తట్టి ‘ష్... పడుకో. పులి వస్తుంది’ అని కాపాడేవాళ్లు. ఆ అలవాటు ఇప్పటికీ మన రక్తంలోనే ఉంది. కాబట్టి నెక్ట్స్ టైమ్ భయం వేస్తే, పెద్దల దగ్గరికి పరిగెత్తి వీపు అప్పగించేయండి. తట్టు ఫ్రీ... భయం పరార్. -
రోబో అంకుల్! చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా?
పిల్లలూ... మనం షాపుకెళితే ‘చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా’ అని అంకుల్ అడుగుతాడు. కాని ఇక్కడ అంకుల్ లేడు రోబో ఉంది. అందుకే ఈ షాపు పేరు ‘గెలాక్సీ రోబో కియోస్క్’.2026 జూలై 17న చైనాలోని బీజింగ్‌లో తీసిన ఫోటో ఇది. ఈ షాపులో ఏం కావాలన్నా రోబోనే అమ్ముతుంది. జ్యూస్ బాటిల్స్, నీళ్లు, చిన్న బొమ్మలు.... ఏవైనా సరే. పిల్లలు క్యూలో నిలబడి స్క్రీన్ పై ఏది కావాలో టచ్ చేస్తే, లోపల ఉన్న రోబో ఆ వస్తువును తీసి ఇస్తుంది. చూశారా ఎంత బాగుందో! పిల్లలకు ఇది కొత్త అనుభవం. ‘వావ్! రోబో మనకు జ్యూస్ ఇస్తోంది‘ అని సంతోషంగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోబో షాపులు ఇంకా ఎక్కువ అవుతాయట. అప్పుడు మన ఊళ్లో కూడా వస్తాయేమో! అన్నట్టు ఈ రోబో పేరు ‘హ్యూమనాయిడ్ సెల్లర్ రోబో’. అంటే మనిషిలా నిలబడి సామాన్లు అమ్మే రోబో. బీజింగ్‌లోని ‘గెలాక్సీ’ కంపెనీ దీనిని తయారు చేసింది. వెల దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 8 నుంచి 12 గంటల వరకు ఆగకుండా పని చేస్తుంది. లోపల కెమెరా, సెన్సార్లు ఉంటాయి. మీరు ఏ బటన్ నొక్కితే ఆ వస్తువును తీసి ఇస్తుంది. అలసి΄ోదు, కోప్పడదు, లెక్క తప్పదు! -
తడిసిన పుస్తకం.. మూడు రోజుల కూలీ!
అబ్రహాం లింకన్ కి 11 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియానాలోని పిజన్ క్రీక్ దగ్గర ఉండేవాడు. చదువంటే పిచ్చి. పక్క ఊరిలో జోసియా క్రాఫోర్డ్ అనే రైతు దగ్గర ‘ద లైఫ్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్’ అనే పుస్తకం ఉందని తెలిసింది. లింకన్ బతిమాలి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి వర్షం. గుడిసె కప్పులో నుంచి నీళ్లు కారి, పుస్తకం తడిసి నాశనం అయ్యింది.తెల్లారి లింకన్ ఏడుస్తూ క్రాఫోర్డ్ దగ్గరికి వెళ్లి, ‘నేను పుస్తకం పాడు చేశాను సార్’ అని ఒప్పుకున్నాడు. క్రాఫోర్డ్ దానికి ‘సరే, మూడు రోజులు నా పొలంలో పని చెయ్. అప్పు తీరిపోతుంది’ అన్నాడు. 11 ఏళ్ల లింకన్ మొక్కజొన్న పొలంలో, పందుల షెడ్డులో మూడు రోజులు కూలి చేశాడు. పుస్తకానికి ఖరీదు కట్టాడు. ఆ పుస్తకాన్ని మళ్లీ ఎండబెట్టి, అట్ట వేసి, పూర్తిగా చదివాడు. నిజాయితీ ఉన్నవాడు పైకి వస్తాడని ఈ ఘటన చెబుతోంది. -
దురాశ తగదు
హేలాపురి అడవి దగ్గర్లో రామయ్య, సీతమ్మ అనే వృద్ధ దంపతులు ఓ గుడిసెలో కాపురం ఉంటున్నారు. కడుపేదలైన ఆ దంపతులకు పిల్లలు లేరు. రామయ్య అడవిలో కట్టెలు కొట్టి సంతలో అమ్మి డబ్బులు తీసుకువచ్చేవాడు. ఆ కొద్ది డబ్బుతోనే వారి ఆహారం, మిగిలిన అవసరాలు తీర్చుకునేవారు. ఒకనాడు వర్షంపడుతూ ఉండటంతో రామయ్య అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లలేకపోయాడు. సీతమ్మ కుండలో చెయ్యి పెడితే, ఆమె చేతికి రెండు గుప్పెళ్ల బియ్యం దొరికాయి. ఆ బియ్యాన్నే ఆమె దంచి పిండి చేసి ఒకే ఒక్క రొట్టె చేసింది. పళ్లెం ముందుపెట్టుకొని ఆ దంపతులిద్దరూ రొట్టెని పంచుకుని తిందామనుకునేంతలో గుడిసె తలుపు చప్పుడైంది. తలుపు తెరిచి చూస్తే గుమ్మంలో వర్షానికి తడిసిన ఓ సాధువు కనిపించాడు. ఆ దంపతులు సాధువును లోపలికి ఆహ్వానించి పొడి బట్టలిచ్చారు. సాధువు ఆకలి మీద ఉండటం గమనించిన రామయ్య.. ఆయన ముందు రొట్టె ఉన్న పళ్లాన్ని ఉంచాడు. ‘‘మీరిద్దరూ తిన్నారా నాయనా?’’ అని సాధువు అడిగితే, ‘‘తమరు తినండి స్వామీ.. మేము తర్వాత తింటాం’’ అన్నారా దంపతులు. వారివద్ద తినడానికి మరో రొట్టె లేదని గ్రహించిన సాధువు... ‘‘మీరు కూడా రండి. ఈ రొట్టెనే తలాకొంచెం పంచుకుని తిందాం. కొయ్యడానికి చాకు పట్టుకురా!’’ అన్నాడు. రామయ్య చాకు తీసుకురాగానే రొట్టెను చాకుతో ముక్కలుగా కోశాడు. విచిత్రంగా ముక్కలు కోసినా కూడా రొట్టె మళ్లీ పూర్తి రొట్టెగా మారిపోయింది. మళ్లీ ఆ రొట్టెను ఎన్ని ముక్కలుగా కోసినా అది మొత్తం పూర్తి రొట్టెగానే ఉండిపోసాగింది. ముగ్గురూ సంతృప్తిగా రొట్టె ముక్కలు తిన్న తర్వాత కూడా అది పూర్తి రొట్టెగానే ఉండిపోయింది. ‘‘నాయనా! మీ కోసం చేసుకున్న రొట్టెను నాకు పెట్టి, మీరు పస్తులుందామనుకున్నారు కదూ! ఇకపై మీరేనాడూ పస్తులుండవలసిన అవసరం లేదు. ఈ రొట్టెను ఎంతకాలం, ఎంతమంది తిన్నా ఇది అందరికీ సరిపోతుంది. ఈ రొట్టెను పరోపకారానికి మాత్రమే వాడాలి. మీ స్వార్థానికి కాదు సుమా అని చెప్పి ఆ సాధువు ఆ దంపతులను ఆశీర్వదించి వాన తగ్గడంతో అడవిలోకి వెళ్లిపోయాడు.’’ ఆరోజు నుంచి రామయ్య, సీతమ్మ దంపతులు ఆ రొట్టెను ముక్కలుగా చేసి తమ ఆకలిని తీర్చుకోవడమే కాకుండా... గంపెడు ముక్కలు చేసి అడవిలో ఆకలిగొన్న వేటగాళ్లకు, కట్టెలు కొట్టుకునే వాళ్లకు, బాటసారులకు పంచసాగారు. ఎంతమందికి ఎంతకాలం పంచినా ఆ రొట్టె మాత్రం తరిగిపోవడం లేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు సీతమ్మ..‘‘ ఏమయ్యా! ఎంతకాలం ఈ రొట్టె ముక్కలను ఎంతమందికని ఉచితంగా పంచుతాం! ఇకపై రొట్టె ముక్కలిచ్చిన వాళ్ల దగ్గర నుంచి తృణమో, పణమో పుచ్చుకుందాం. ఏమంటావు!’’ అన్నది. రామయ్య కాదని చెప్పలేకపోయాడు. ఆరోజు రొట్టె ముక్కలను గంప నిండా పెట్టుకొని అడవిలోని యాత్రికులకు, వేటగాళ్లకు, కట్టెలు కొట్టుకునే వాళ్లకు ఇచ్చి.. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నది సీతమ్మ. గంప నిండా తీసుకొచ్చిన రొట్టె ముక్కలు అయిపోయాయి. ఇంటికి వెళ్లిన తర్వాత సంచి తెరిచి చూసుకుంటే రొట్టె ముక్కలు తిన్నవాళ్లు ఇచ్చిన డబ్బులు మాయమైపోయాయి. సాధువు మంత్రించి ఇచ్చిన రొట్టె కూడా మాయమైపోయింది. ఆ రొట్టెను పరోపకారానికి తప్ప తమ స్వార్థానికి ఉపయోగించవద్దని సాధువు చెప్పిన మాటను పాటించనందుకు తమకు తగిన శాస్తే జరిగిందని గ్రహించి విచారపడ్డారు ఆ దంపతులు. తిరిగి ఆనాటి నుంచి రామయ్య కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి, సంతలో అమ్మి డబ్బులు తీసుకువస్తేనే వాళ్లు ఇంత తిండి తినగలుగుతున్నారు. దురాశ ఎప్పుడూ దుఃఖానికి చేటు కదా! -
పులి మేక స్నేహ గీతం
‘‘కుక్క–పిల్లి, పిల్లి–ఎలుక, పులి–మేక’’ వంటి జాతి తారతమ్యాలు ఉన్న జంతువులు... ఎప్పుడూ ఒకదాన్ని చూస్తే ఒకటి పరుగుతీస్తాయి. ఒకటి పారిపోవడానికి, మరొకటి పట్టుకోవడానికి..! ఆ వైరం, తారతమ్యం జన్మతః వస్తుంది. కానీ ఈ పులి–మేకలది జన్మజన్మల బంధమై ఉంటుంది. జూలో ఆహారంగా వేసిన మేకతోనే దోస్తానీ చేసింది పులి. పెద్దన్న పెద్ద మనసుని అర్థం చేసుకుంది మేక. ఒకే ఎన్‌క్లోజర్‌లో... ‘దోస్తుమేరా దోస్తు’ అంటూ తిరిగాయి. కలిసి ఎన్నో ఊసులాడుకున్నాయి. ‘కలిసుంటే కలదు సుఖం’ అంటూ పాటలు కూడా పాడుకున్నాయి. వాటి అనురాగాన్ని చూసిన వారంతా ‘అహో’ అంటూ ముచ్చటపడ్డారు. పులికి అముర్ అని, మేకకు టుమర్ అని పేర్లు కూడా పెట్టారు. ఇదంతా ఏడాది క్రితం కథ. అంత అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు ఏమైందో ఏమో కానీ ఒకదానిపై ఒకటి కాలుదువ్వుకున్నాయి. దాంతో జాగ్రత్తపడ్డ జ్యూ సిబ్బంది.. రెండింటిని పక్కపక్క ఎన్క్లోజర్ల్లోకి మార్చేశారు. అయితే ఈ మధ్య మిస్టర్ అముర్(పులి)... టుమర్(మేక)ను కలుసుకోవడానికి ఎన్‌క్లోజర్ దగ్గరకు వస్తోంది. దాంతో కళ్లు కళ్లు ప్లస్.. అంటూ ఆ ఎన్‌క్లోజర్ ఊసల్లోంచే ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నాయి. ‘‘ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే.. ఇదేలే..’’ అంటూ డ్యూయెట్ వేసుకుంటున్నాయి. అన్నట్టు ఈ దోస్తానులు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు కదూ..! రష్యాలోని మాస్కోలో ప్రిమోర్స్కీ సఫార్ పార్క్‌లో జీవిస్తున్నాయి.


