
పులి మేక స్నేహ గీతం
కుక్క–పిల్లి, పిల్లి–ఎలుక, పులి–మేక’’ వంటి జాతి తారతమ్యాలు ఉన్న జంతువులు... ఎప్పుడూ ఒకదాన్ని చూస్తే ఒకటి పరుగుతీస్తాయి. ఒకటి పారిపోవడానికి,
‘‘కుక్క–పిల్లి, పిల్లి–ఎలుక, పులి–మేక’’ వంటి జాతి తారతమ్యాలు ఉన్న జంతువులు... ఎప్పుడూ ఒకదాన్ని చూస్తే ఒకటి పరుగుతీస్తాయి. ఒకటి పారిపోవడానికి, మరొకటి పట్టుకోవడానికి..! ఆ వైరం, తారతమ్యం జన్మతః వస్తుంది. కానీ ఈ పులి–మేకలది జన్మజన్మల బంధమై ఉంటుంది. జూలో ఆహారంగా వేసిన మేకతోనే దోస్తానీ చేసింది పులి. పెద్దన్న పెద్ద మనసుని అర్థం చేసుకుంది మేక. ఒకే ఎన్‌క్లోజర్‌లో... ‘దోస్తుమేరా దోస్తు’ అంటూ తిరిగాయి.
కలిసి ఎన్నో ఊసులాడుకున్నాయి. ‘కలిసుంటే కలదు సుఖం’ అంటూ పాటలు కూడా పాడుకున్నాయి. వాటి అనురాగాన్ని చూసిన వారంతా ‘అహో’ అంటూ ముచ్చటపడ్డారు. పులికి అముర్ అని, మేకకు టుమర్ అని పేర్లు కూడా పెట్టారు. ఇదంతా ఏడాది క్రితం కథ. అంత అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు ఏమైందో ఏమో కానీ ఒకదానిపై ఒకటి కాలుదువ్వుకున్నాయి. దాంతో జాగ్రత్తపడ్డ జ్యూ సిబ్బంది.. రెండింటిని పక్కపక్క ఎన్‌క్లోజర్‌ల్లోకి మార్చేశారు.
అయితే ఈ మధ్య మిస్టర్ అముర్(పులి)... టుమర్(మేక)ను కలుసుకోవడానికి ఎన్‌క్లోజర్ దగ్గరకు వస్తోంది. దాంతో కళ్లు కళ్లు ప్లస్.. అంటూ ఆ ఎన్‌క్లోజర్ ఊసల్లోంచే ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నాయి. ‘‘ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే.. ఇదేలే..’’ అంటూ డ్యూయెట్ వేసుకుంటున్నాయి. అన్నట్టు ఈ దోస్తానులు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు కదూ..! రష్యాలోని మాస్కోలో ప్రిమోర్‌స్కీ సఫార్ పార్క్‌లో జీవిస్తున్నాయి.