కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు | IAS Rohini Sindhuri Mother Srilakshmi Reddy Nepal Inciddent | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు

Aug 29 2026 9:20 AM | Updated on Aug 29 2026 9:30 AM

IAS Rohini Sindhuri Mother Srilakshmi Reddy Nepal Inciddent

ఖమ్మం జిల్లా: ‘టీ తాగేందుకు పది నిమిషాలు ఆగడం వల్లే ప్రాణాలు దక్కించుకున్నాం.. కళ్ల ముందే జరిగిన పెను విషాదంతో నోట మాట రావడం లేదు..’అని మానస సరోవర యాత్రకు వెళ్తూ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిన ఖమ్మం జిల్లా వాసి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన దాసరి శ్రీలక్ష్మిరెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్‌లో మాట్లాడగా వివరాలు వెల్లడించారు. 

సరోవర్‌ యాత్రకు అనుమతి ఆలస్యం కావడంతో కఠ్మాండులో బస చేసి ఈనెల 21న నేపాల్‌ నుంచి మరికొందరితో బయలుదేరినట్లు లక్ష్మిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అలసటగా ఉందంటూ బృందంలోని ఓ సభ్యురాలు అనడంతో అంతా టీ తాగేందుకు ఆగినట్లు చెప్పారు. ఆ తర్వాత నిమిషాల్లోనే భారీ వరద ముంచెత్తడం...తమ ముందు వెళ్లిన వాహనాలు భారీ బురద, నీటి ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాయని తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారని వెల్లడించారు. అయితే ముందుగా వెళ్లిన వాహనాల్లో తమ ట్రావెల్‌ బ్యాగులు, బట్టలు, ఇతర సామగ్రి మొత్తం కొట్టుకుపోయాయని చెప్పారు. 

సామగ్రి కోల్పోయినా బృందంలోని అందరం క్షేమంగా బయటపడటం సంతోషంగా ఉందని తెలిపారు. పరిసర గ్రామాల్లో పరిస్థితి భయానకంగా ఉందని, వరదతో ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా హృదయ విదారకరమైన దృశ్యాలే కనిపించాయని చెప్పారు. శ్రీలక్ష్మిరెడ్డి భర్త దాసరి జయపాల్‌రెడ్డి హైకోర్టు న్యాయవాది కాగా, వీరి పెద్దకుమార్తె దాసరి రోహిణి సింధూరి కర్ణాటక కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, చిన్న కూతురు ప్రియాంకరెడ్డి బెంగళూరులో ప్రముఖ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కాగా, శ్రీలక్ష్మిరెడ్డి బృందం శుక్రవారం రాత్రి సురక్షితంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. 

చదవండి: యుగాంతం రేంజ్‌లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement