ఏమిటీ బయట వాన పడుతోందా?..వావ్..!
బ్యూటిఫుల్..వెదర్ ఇంక..భలే ఉంది...
...ఇలాంటి ఆశ్చర్యాలు నగరంలోని ఎయిర్ కండిషన్డ్ కార్పొరేట్ కార్యాలయాల్లో సర్వసాధారణం. నడిరోడ్డుపై కుంభవృష్టి కురుస్తున్నా కనీసం చినుకు చప్పుడు కూడా చొరబడలేని ప్రాంగణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వాన రాకడ..పోకడ తెలియకపోవడం, వారికి వానవీక్షణ అపురూపంగా మారడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే సన్‌రైజ్, సన్‌సెట్‌ల లాగే ఇప్పుడు ‘ఇట్స్ రెయినింగ్ టైమ్’ అంటూ వరుణిడి సందడికి నిశ్శబ్ధ సందర్శకులుగా మారుతున్నారు. అలాంటి వారి కోసం నగరంలో కొన్ని కేఫ్స్ ఈ వర్షం సాక్షిగా అంటూ ప్రత్యేక ఆహా్వనాలు పలుకుతున్నాయి.
రెయిన్ ఎట్ కేఫ్స్
రూఫ్‌టాప్ వ్యూస్, సరస్సు ఒడ్డున కూర్చునే ప్రదేశాలు, ఫెయిరీ లైట్లతో అలంకరించిన ఇంటీరియర్స్ వరకు, మేఘాలు కమ్ముకున్నప్పుడు మరిన్ని కొత్త అందాలు పంచే కేఫ్స్ ఎన్నో ఉన్నాయి. వేడి వేడి కాఫీతో మన చిన్ననాటి వర్ష జ్ఞాపకాలను నెమరువేసుకోవాలనుకున్నా, ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ చినుకుల చప్పుళ్లకు చిరు సంభాషణలు జత చేయాలన్నా, అద్దాల సీలింగ్‌పైనా గాజు కిటికీలపైనా జాలువారే వర్షపు చినుకులను చూడాలనుకున్నా అలాంటి రెయిన్ డ్రీమ్స్‌కి కేఫ్స్ కేరాఫ్‌గా మారుతున్నాయి.
అలాంటి కేఫ్స్ గురించి...
వర్షం పడుతున్నప్పుడు టెర్రస్ మీదకు పరుగెత్తాలని అనిపిస్తుంటే బంజారాహిల్స్‌లోని హ్యాబిటాట్ కేఫ్ ఆ కోరికని తీరుస్తుంది. 5వ అంతస్తులో ఉన్న ఈ కేఫ్, పాక్షికంగా తెరిచి ఉన్న టెర్రస్ సీటింగ్‌ను, ఇండోర్ లాంజ్‌తో మిళితం చేస్తుంది.పెద్ద కాన్వాస్ గొడుగులతో, వర్షాల సమయంలో ఈ టెర్రస్ పొగమంచుతో కూడిన స్థలంగా
మారుతుంది.సిటీలో మొట్టమొదటి గార్డెన్ కేఫ్‌గా పేరొందింది జూబ్లీహిల్స్‌లోని అర్బన్ నెమో. పచ్చని చెట్లు మొక్కలతో నిండి వర్షాకాలంలో ఆకులపై వర్షపు చినుకులు పడుతుండగా తడి మట్టి వాసన గాలిని నింపుతుండగా వర్షపు సమయాన్ని నిజంగా ఆస్వాదించేలా చేస్తుంది.
ఎత్తైన పైకప్పులు..గాజు కప్పుతో ఆకర్షించే జూబ్లీహిల్స్‌లోని ’ది బౌగే విలియా జూసీ’ వర్షాన్ని ఆస్వాదించడానికి మరో సరైన ప్రదేశం. గాజు కప్పు కింద వెచ్చగా ఆసీనులై, ఆకాశం నుంచి జాలువారే వర్షపు చినుకులను తనివితీరా చూడవచ్చు, కేఫ్‌లోని పచ్చని వాతావరణం కళాత్మక అలంకరణ మనకి ఒక గ్రీ¯న్‌హౌస్‌లో ఉన్న ఫీల్‌ను ఇస్తాయి.
కేరళ శైలి వాస్తుశిల్పం పల్లెటూరి ఆకర్షణతో, వర్షాకాలంలో ఆకట్టుకుంటుంది బంజారాహిల్స్‌లోని ఆరోమలే. దీని లోపలి కూర్చునే ప్రదేశం ఒక గాజు గదిని పోలి ఉండి, వెచ్చని వాతావరణాన్ని అందిస్తుంది. సందర్శకులు తడవకుండానే వర్షాన్ని ఆస్వాదించేలా కూర్చునేందుకు పెద్ద గొడుగులను వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.
సాక్షి, హైదరాబాద్:


