breaking news
warning label
-
ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై వార్నింగ్ లేబుల్
న్యూఢిల్లీ: అదనపు సంతృప్త కొవ్వు, అదనపు చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ల ముందు భాగంలో ఎరుపు రంగులో స్పష్టంగా కనిపించేలా హెచ్చరిక లేబుల్‌ను ముద్రించాలని ప్రతిపాదించినట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల గురించి వినియోగదారులకు సరళమైన, స్పష్టమైన, సులభంగా అర్థమయ్యే హెచ్చరికను అందించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని పేర్కొంది. 2024లో ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ జారీ చేసిన ఆహార మార్గదర్శకాల్లో పేర్కొన్న పరిమితుల ఆధారంగా.. అదనపు సంతృప్త కొవ్వు, అదనపు చక్కెర మరియు ఉప్పు వంటివి అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ముందు భాగంలో ఎరుపు రంగు షడ్భుజి ఆకారంలో ప్రముఖంగా హెచ్చరిక లేబుల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ హానికారక పదార్థాలున్న ఆహార ప్యాకెట్లపై ఈ రెండు వార్నింగ్ లేబుల్ ముద్రించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలియజేసింది. ‘3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’ అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆగస్టు 13న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. -
ఆ వార్నింగ్‌తో మాకు సంబంధం లేదు: ఫేస్బుక్
వాషింగ్టన్: ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో సమాచారానికి కొదవ లేదు. అంతర్జాలంతో కనెక్ట్ అయితే చాలు సమస్త విషయాలు మన కళ్ల ముందున్న తెరపై ప్రత్యక్షమవుతాయి. అయితే అలా కనిపించే విషయాలన్నీ వాస్తవాలని నమ్మడానికి వీలు లేదు. ఇప్పుడున్న పెద్ద సమస్య ముందున్న సమాచారంలో ఏది వాస్తవం.. ఏది అవాస్తవం అని నిర్ధారించుకోవడమే. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సైతం ఇలాంటి అవాస్తవాల ప్రచారాలకు వేదికగా మారుతున్న విషయం తెలిసిందే. దీంతో యూజర్లను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత నెల వెల్లడించారు. ఫేస్బుక్ నిపుణుల బృందం దీనిపై కసరత్తులు ప్రారంభించింది. అయితే.. ఇటీవల ఫేక్ ఇన్ఫర్మేషన్కు సంబంధించి యూజర్లను అలర్ట్ చేసే ఫీచర్‌ను ఫేస్బుక్ టెస్ట్ రన్ చేసిందని, ఓ వినియోగదారుడి మొబైల్ స్క్రీన్‌పై 'నమ్మదగిన సోర్స్ కాదు' అంటూ ఫేస్బుక్ వార్నింగ్ లేబుల్ కనిపించిందని కోన్ని వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి. దీంతో ఫేస్బుక్ స్పోక్స్ పర్సన్ దీనిపై వివరణ ఇచ్చారు. సదరు వినియోగదారుడి మొబైల్ స్క్రీన్‌పై కనిపించిన వార్నింగ్ లేబుల్ గూగుల్ క్రోమ్ అప్డేట్ వెర్షన్ ద్వారా వచ్చిందని.. అది ఫేస్బుక్ చర్య కాదని స్పష్టం చేశారు.


