కాంక్రీట్ నగరాలు ‘ఎడిబుల్ సిటీస్’గా మారితేనే ఆహార సుస్థిరత
అర్బన్ అగ్రికల్చర్‌ను మున్సిపల్ ప్రణాళికల్లో చేర్చాలంటున్న నిపుణులు
ప్రోత్సాహక విధానాల్లేవు...లోతైన అధ్యయనాలు అవసరం
పర్యావరణ అనుకూల నగరంగా ప్రభుత్వం మార్చాలి
తోటలు పెంచే ఇళ్లకు ఆస్తి పన్నులో రాయితీలు ఇవ్వాలి
నేడు ‘వరల్డ్ కిచెన్ గార్డెన్స్ డే ’
సాక్షి, స్పెషల్ డెస్క్: నగరాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటల సాగు పెరుగుతున్నా, అది కేవలం గృహస్తుల హాబీగానే మిగిలిపోతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్‌ను మునిసిపల్ మాస్టర్ ప్లాన్లలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం ఆహారంలో సుమారు 70 శాతం నగరాల్లోనే వినియోగమవుతోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) చెబుతోంది. విధానపరమైన చర్యల ద్వారా నగరాలను ‘ఎడిబుల్ సిటీ’లుగా అంటే.. పర్యావరణ అనుకూల, సుస్థిర ఆహారోత్పత్తి కేంద్రాలుగా మార్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన అధ్యయనం మిద్దె తోటలపై ఆసక్తిని తెలియజెప్తోంది. 70% మంది గృహస్తులు మిద్దె తోటలపై ఆసక్తి చూపుతున్నా, 35% మాత్రమే ప్రస్తుతం పండిస్తున్నారు. 56% ప్రభుత్వ/విద్యా సంస్థల్లో ఖాళీ స్థలాలు, 67% సంస్థల్లో అనువైన టెర్రస్‌లు ఖాళీ స్థలాలున్నాయి. అయితే, అర్బన్ అగ్రికల్చర్ ప్రోత్సాహక విధానాల్లేవు. భువనేశ్వర్ మాదిరిగా ఇక్కడ కూడా లోతైన అధ్యయనాలు చేసి తగిన విధానాలు అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏం చెయ్యాలి?
⇒ అర్బన్ అగ్రికల్చర్ విస్తరణకు స్థల కొరత, నీటి కొరత పెద్ద అవరోధాలు. వీటిని అధిగమించటానికి నిపుణులు కింది ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తున్నారు.
⇒ వాణిజ్య భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలలో రూఫ్‌టాప్ లేదా వర్టికల్ గార్డెనింగ్‌కు స్థలాన్ని తప్పనిసరి చేయటం.
⇒ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను స్థానిక మిద్దె తోటలు, ఇంటిపంటల సాగుకు అనుసంధానించటం.
⇒ తడి చెత్తతో కంపోస్టింగ్ చేసి నాణ్యమైన సేంద్రియ ఎరువులను పంపిణీ చేయటం.
⇒ తోటలు పెంచే ఇళ్లకు ఆస్తి పన్నులో 5–10% రాయితీ, బిందు సేద్యం కిట్లపై సబ్సిడీలు అందించటం.
⇒ ప్రజా స్థలాలు, భవనాల్లో ఆహారోత్పత్తిని పట్టణ ప్రణాళికలో భాగం చేసి స్థానిక మార్కెట్లతో అనుసంధానించటం.
‘ఎడిబుల్ సిటీ’లకు విధానాల మద్దతు
వాతావరణ మార్పుల నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో కుటుంబాలకు తాజా, పోషక ఆహారాన్ని అందించడంలో అర్బన్ అగ్రికల్చర్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరటి, మిద్దె, బాల్కనీ తోటలను విస్తరించటానికి అనుకూలమైన ప్రభుత్వ విధానాల మద్దతు అవసరం. వ్యవసాయ, పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖల సమన్వయంతో ‘ఎడిబుల్ సిటీల’ను అభివృద్ధి చేసి, పర్యావరణ అనుకూల నగరాలను తీర్చిదిద్దడం అత్యవసర వ్యూహం.
– డా. వినీత కుమారి, డిప్యూటీ డైరెక్టర్, ‘మేనేజ్’, సెంటర్ ఫర్ అర్బన్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్
నగర ప్రణాళికలో భాగం చేయాలి
వాతావరణ మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వల్ల ఆహార పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతున్నందున మిద్దె తోటలు వంటి అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను నగర ప్రణాళికలో భాగం చేయాలి. ‘కోకోపోనిక్స్’వంటి మట్టిలేని ఆధునిక సాగు పద్ధతులు స్థల కొరత, నీటి కొరతను అధిగమించి స్థానిక ఆహార భద్రతను పెంచుతాయి.అందువల్ల రాష్ట్ర విధానాలు పట్టణ వ్యవసాయాన్ని, వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించి నగరాలను పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దాలి.
– డాక్టర్ డి. కలైవనన్, శాస్త్రవేత్త, భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్), బెంగళూరు
మిద్దెతోటల్లో ఎల్‌నినో జాగ్రత్తలు
ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల్లో మిద్దె తోటల్లో నీటిని ఆదా చేయడం ముఖ్యం. కుండీల్లో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టుతో మల్చింగ్ చేసి, తేమ ఆవిరవకుండా చూడాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే అవసరమైనంత నీరు పోయాలి. బాల్కనీల్లో బాటిల్ డ్రిప్ వాడడం, ఎండ తీవ్రతను తగ్గించేందుకు 50% గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేయటం వల్ల తక్కువ నీటితో కూరగాయలు, పండ్ల మొక్కలను రక్షించుకోవచ్చు.
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సీనియర్ మిద్దెతోట నిపుణుడు, హైదరాబాద్


