ఏ జిల్లాలో ఏ పంట సాగు ఎంత... రైతుల ఆసక్తి ఏ వైపు? | Digital survey to assess crop details: Telangana | Sakshi
Sakshi News home page

ఏ జిల్లాలో ఏ పంట సాగు ఎంత... రైతుల ఆసక్తి ఏ వైపు?

Aug 30 2026 5:28 AM | Updated on Aug 30 2026 5:28 AM

Digital survey to assess crop details: Telangana

పంటల లెక్క తేల్చే డిజిటల్‌ సర్వే

రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పంటల నమోదు

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పంటల గణాంకాల స్వరూపం మారనుంది. ఇప్పటివరకు పంటల సాగు విస్తీర్ణం, పంటల వారీగా అంచనాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ ఏఈఓలు సేకరించేవారు. ఇకపై ప్రతి పొలం స్థాయిలో ఏ రైతు.. ఎన్ని ఎకరాల్లో.. ఏ పంట సాగు చేశాడు? ఏ రకం విత్తనం వేశాడు? సాగు విధానం ఏమిటి? వంటి వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ‘డిజిటల్‌ క్రాప్‌ సర్వే’కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయశాఖ అభివృద్ధి చేసిన డిజిటల్‌ క్రాప్‌ సర్వే వ్యవస్థలో క్షేత్రస్థాయికి వెళ్లి పొలాల వివరాలను నమోదు చేస్తారు. వ్యవసాయ–వ్యవసాయేతర భూముల వివరాలను కూడా నమోదు చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

33 జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
అన్ని జిల్లాల్లో గ్రామాలు, మండలాల వారీగా సర్వేయ­ర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. రైతు సాగు చేస్తున్న పొలాన్ని గుర్తించి.. అక్కడ ఏ పంట ఉందో పరిశీలించి డిజిటల్‌ వ్య­వస్థలో నమోదు చేస్తారు. రైతులు కూడా సర్వేయర్లకు తమ పంట వివరాలను సరిగ్గా తెలియజేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు వివరాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో ఖరీఫ్, రబీ కలిపి 27 ప్రధాన పంటలు సాగవుతున్నాయి.

సన్న వడ్లకు రూ.500 బోనస్‌కు ఇదే ఆధారం
సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ అందించే పథకానికి పంట వివరాలకు డిజిటల్‌ సర్వేను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అందువల్ల రైతులు తాము సాగు చేసిన వరి రకాన్ని సర్వేయర్లకు స్పష్టంగా చెప్పి నమోదు చేయించుకోవాలి. పంట రకం నమోదు కాకపోతే బోనస్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.

రైతు భరోసా లెక్కల్లోనూ
డిజిటల్‌ క్రాప్‌ సర్వే కేవలం పంటల గణాంకాల సేకరణకే పరిమితం కాకుండా భవిష్యత్‌లో రైతు సంక్షేమ పథకాల అమలులోనూ కీలకంగా మారనుంది. ముఖ్యంగా ‘రైతు భరోసా’అమలులో రైతు సాగు చేస్తున్న భూమి, పంట విస్తీర్ణానికి సంబంధించిన ధ్రువీకరించిన సమాచారం ప్రాముఖ్యత సంతరించుకోనుంది. డిజిటల్‌ క్రాప్‌ సర్వే ద్వారా ఇదే సమాచారం నిరంతరం అందుబాటులో ఉండనుందని వ్యవసాయ శాఖ చెబుతోంది.

తేలనున్న పంటల డిమాండ్‌ ?
డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో ప్రతి జిల్లాలో రైతులు ఏ పంటల వైపు మొగ్గు చూపుతున్నారనే దానిపై స్పష్టమైన గణాంకాలు లభిస్తాయి. ఉదాహరణకు ఒక జిల్లాలో వరి విస్తీర్ణం పెరుగుతుంటే.. మరో జిల్లాలో పత్తి లేదా మొక్కజొన్న సాగు పెరుగుతున్నదా? పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు ఎక్కడ పెరుగుతోంది? ఏ ప్రాంతాల్లో ఉద్యాన పంటలు విస్తరిస్తున్నాయి?  వంటి అంశాలను గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విశ్లేషించొచ్చు. దీని ఆధారంగా ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, వ్యవసాయ యంత్రాలు, కొనుగోలు కేంద్రాలు, గిడ్డంగులు, మార్కెటింగ్‌ సదుపాయాల అవసరాలను ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement