ఎంపీ మేనకా గురుస్వామి
విద్య, పరీక్షలు, ఉద్యోగాలే యువతకు కీలకం
‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్’లో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో ఉందని, పార్లమెంట్‌లో భిన్నాభిప్రాయాలను అణచివేస్తే ప్రజలు చివరకు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వస్తుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి పేర్కొన్నారు. విద్య, పరీక్షలు, ఉద్యోగాలు దేశ యువతకు అత్యంత కీలకమైన అంశాలన్నారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, అవకాశాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటన హక్కులతో పాటు పని, జీవనోపాధి అవకాశాలు యువత జీవితాల్లో ఎంతవరకు అమలవుతున్నాయో సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దివంగత ఎంపీ ఎస్. జైపాల్‌రెడ్డి మెమోరియల్, మంథన్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్’పై మేనకా గురుస్వామి ప్రసంగించారు. కార్యక్రమానికి నల్సార్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలకు యువత రాసేది కేవలం పరీక్షలు కాదని.. స్థిరమైన ఉద్యోగం, భద్రమైన ఆదాయం, కుటుంబ భవిష్యత్‌కు భరోసా అని మేనకా గురుస్వామి చెప్పారు.
ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలు పరీక్షను మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థపై యువతకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. నీట్ వంటి పరీక్షలు మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన జీవితానికి ఒక అవకాశంగా మారాయని, కోచింగ్ ఫీజులు, కుటుంబ పొదుపులు, విద్యా రుణాల రూపంలో తల్లిదండ్రులు భారీగా ఖర్చు చేస్తున్న విషయాలను ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు.
డిగ్రీలు ఓకే.. ఉద్యోగాలు ఎక్కడ?
‘ఉన్నత విద్య పూర్తిచేసిన యువతలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. 2004–2023 మధ్య ప్రతి ఏడాది సుమారు 50 లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం వస్తే, వారిలో సుమారు 28 లక్షల మందికే ఉద్యోగాలు లభించాయి. దాదాపు 22 లక్షల మంది ఉద్యోగాలు లేకుండా మిగిలిపోతున్నారు. విద్య నుంచి ఉపాధికి వెళ్లే మార్గంలో ప్రభుత్వం, విద్యా సంస్థలు స్పష్టమైన వంతెన నిర్మించాల్సిన అవసరం ఉంది’అన్నారు మేనకా గురుస్వామి.
ప్రభుత్వ విద్యా సామర్థ్యం తగ్గి ప్రైవేట్ విద్య విస్తరించడంతో విద్య ఖర్చు కుటుంబాలకు భారంగా మారుతోందని, పాఠశాల, కోచింగ్, రవాణా, హాస్టల్, కాలేజీ ఫీజులతో పాటు విద్యా రుణాలు కూడా మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయన్నారు. శాంతియుతంగా సమావేశమై నిరసన తెలిపే హక్కు ఆర్టికల్ 19(1)(బీ) ఇచ్చిందని, ప్రజాశాంతి, సార్వభౌమత్వం, సమగ్రత వంటి అంశాల దృష్ట్యా సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చని, అయితే నియంత్రణ పేరుతో నిరసన హక్కునే నిషేధంగా మార్చకూడదన్నారు.
డీలిమిటేషన్ దక్షిణాదిపై ప్రభావం
రాజ్యాంగ నిర్మాణ సమయంలో విభేదించిన అభిప్రాయాలపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరిగేదని, ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు, విమర్శలకు తగిన స్థానం లేకపోవడం ఆందోళనకరమని మేనకా గురుస్వామి పేర్కొన్నారు. ప్రతిపక్షం ప్రశ్నించే అవకాశం కోల్పోతే చర్చకు బదులుగా వీధుల్లో నిరసనలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. తాజా డీలిమిటేషన్ బిల్లు దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదనకు స్పష్టమైన గణిత ప్రాతిపదిక, హేతుబద్ధమైన కారణాన్ని ప్రభుత్వం వివరించాలని, గతంలో కేంద్రం కోరినట్లు జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు భవిష్యత్‌లో రాజకీయంగా నష్టం రాకుండా చూడాలన్నారు.


