నేడే నీట్‌ పీజీ పరీక్ష | NEET PG exam today | Sakshi
Sakshi News home page

నేడే నీట్‌ పీజీ పరీక్ష

Aug 30 2026 4:07 AM | Updated on Aug 30 2026 4:07 AM

NEET PG exam today

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష  

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 56 కేంద్రాలు.. 17,600 మంది అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌ పీజీ–2026) నేడు (ఆదివారం) జరగనుంది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 340 నగరాల్లోని సుమారు 1,300 పరీక్షా కేంద్రాల్లో ఒకే విడతలో కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించేందుకు జాతీయ వైద్య పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎస్‌) ఏర్పాట్లు చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య 12.5 శాతానికిపైగా పెరిగింది. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగియనుంది. అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియ ఉదయం నుంచే ప్రారంభమవుతుంది.

ఎలాంటి చివరి నిమిషం ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు అడ్మిట్‌ కార్డుతో పాటు చెల్లుబాటయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. రాష్ట్రంలో నీట్‌ పీజీ పరీక్షకు 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 17,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థుల ప్రవేశానికి ఉదయం 7 గంటల నుంచే అనుమతించనున్నారు. ఈ ఏడాది నీట్‌ పీజీ పరీక్ష విధానంలో మార్పులు చేశారు. మొత్తం 180 ప్రశ్నలకు 210 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే ఒక్కో ప్రశ్నకు ఎక్కువ సమయం లభించేలా పరీక్ష వ్యవధి, ప్రశ్నల సంఖ్యను పునర్వ్యవస్థీకరించారు. 

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా, బయోమెట్రిక్‌ ధ్రువీకరణ, తనిఖీలు, సిగ్నల్‌ జామర్లు, ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా 60 వేల మందికిపైగా పరీక్ష సిబ్బందిని విధుల్లో నియమించారు. నీట్‌ పీజీ పరీక్షకు సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రశ్నపత్రం లీక్, పరీక్ష వాయిదా వంటి వదంతులు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షపై ఎలాంటి అధికారిక సమాచారం అయినా ఎన్‌బీఈఎంఎస్‌ వెబ్‌సైట్‌లోనే వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే ఆదివారం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement