నాన్ ఇంటర్‌లాకింగ్ లెవల్ క్రాసింగ్స్ వద్ద ఏఐ ఆధారిత నిఘా కెమెరాలు
గతేడాది కడలూరు ప్రమాద ఘటనలో తాజాగా సిబ్బంది ఆడియో సంభాషణ వెలుగులోకి
దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు...తక్షణం నిఘా కెమెరాల ఏర్పాటుకు ఆదేశం
తెలంగాణలో వంద వరకు అలాంటి లెవల్ క్రాసింగ్స్
స్టేషన్‌మాస్టర్, హెడ్ ఆఫీసు కంట్రోల్ రూమ్స్‌లో అన్ని గేట్ల రియల్ టైం దృశ్యాలు పరిశీలించే వీలు
సాక్షి, హైదరాబాద్: రైలు వస్తోందని తెలిసినా, స్టేషన్ మాస్టర్‌తో రహస్య కోడ్ (ప్రైవేట్ నంబర్) మారి్పడి చేసుకున్న తర్వాత కూడా లెవల్ క్రాసింగ్ వద్ద గేటు వేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొందరు గేట్ కీపర్ల నిర్లక్ష్యానికి రైల్వేబోర్డు అడ్డుకట్ట వేస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థతో అనుసంధానం లేని (నాన్–ఇంటర్‌లాకింగ్) లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరుగుతున్న ఇటువంటి ప్రమాదకర ఉదంతాలను తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ..దేశవ్యాప్తంగా ఇలాంటి అన్ని గేట్ల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కలిగిన నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో దాదాపు వంద వరకు ఇలాంటి గేట్లున్నాయి. వీటన్నింటి వద్దకూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా జీఎం శ్రీవాస్తవ, ఈ కెమెరాల ఏర్పాటును వేగిరం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. రైల్వే నిబంధనల ప్రకారం.. నాన్–ఇంటర్‌లాకింగ్ గేట్ల వద్ద రైలు స్టేషన్ దాటడానికి లేదా సిగ్నల్ ఇవ్వడానికి ముందు స్టేషన్ మాస్టర్, సదరు గేట్ కీపర్‌కు ఫోన్ చేస్తారు. గేటు మూసివేసి, లాక్ చేశానని గేట్ కీపర్ చెప్పిన తర్వాత ఇద్దరి మధ్య ఒక ప్రత్యేక కోడ్ నెంబరు మార్పిడి జరుగుతుంది. గేట్ కీపర్ చెప్పిన నెంబర్‌ను స్టేషన్ మాస్టర్, స్టేషన్ మాస్టర్ చెప్పిన నెంబర్‌ను గేట్ కీపర్ సంబంధిత రికార్డుల్లో నమోదయ్యాకే రైలు ముందుకు కదులుతుంది.
అయితే గేటు మూసిన 10 నిమిషాల తర్వాత గానీ రైలు రాదు. దీంతో అంతసేపు గేటు వద్ద ఎదురుచూడ్డం కొందరు వాహనదారులకు చిరాకుగా ఉంటుంది. దీంతో వారు రైలు దగ్గరగా వచ్చిన తర్వాతే గేటు వేయాలంటూ సిబ్బందిపై నయానోభయానో ఒత్తిడి తెస్తుంటారు. ఇటీవల కాలంలో కొందరు గేట్ కీపర్లు గేటు వేయకుండానే, కేవలం ఫోన్ ద్వారా కోడ్ నెంబర్ ఇచ్చేసి.. రైలు గేటును సమీపించేవరకు గేటు వేయడం లేదు. దీంతో దేశంలో తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు స్టేషన్ మాస్టర్‌కు గేటు మూసి ఉందో లేదో నేరుగా చూసే అవకాశం లేకపోవడం ఈ లోపానికి ప్రధాన కారణం.
నాన్ ఇంటర్‌లాకింగ్ గేట్ల వద్దే సమస్య ఎందుకు?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైల్వే లైన్లను సిగ్నళ్లతో అనుసంధానిస్తున్నారు. దీనివల్ల గేటు మూస్తేనే లెవల్ క్రాసింగ్ వద్ద రైలుకు గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది. గేటు తెరిచి ఉన్నంత సేపు రెడ్ సిగ్నలే ఉంటుంది. నాన్ ఇంటర్ లాకింగ్ లెవల్ క్రాసింగ్స్ వద్ద స్టేషన్‌మాస్టర్ గేట్ కీపర్‌తో మాట్లాడి గేటు మూసేశాడన్న మాట విన్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. గేటు తెరిచి ఉన్నా సిగ్నల్ మాత్రం గ్రీన్‌లో ఉండి రైలు దూసుకెళ్తుంది.
ఏఐ సీసీటీవీ కెమెరాలు ఇలా పనిచేస్తాయి...
ఈ కెమెరా రికార్డింగ్‌ను రియల్‌టైమ్‌లో స్టేషన్‌మాస్టర్ గదిలో, డివిజినల్ ఇంజనీరింగ్ కంట్రోల్ రూమ్‌లో చూసే వెసులుబాటు ఉంటుంది. రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందే గేటు మూసి ఉందో లేదో స్టేషన్ మాస్టర్ కళ్లారా చూసి నిర్ధారించుకోవచ్చు. నిర్దేశిత సమయం దాటినా గేటు మూసివేయకున్నా, లేదా కోడ్ నెంబర్ ఇచ్చి కూడా గేటు తెరిచి ఉంచినా ఈ ఏఐ సిస్టమ్ కంట్రోల్ రూమ్‌లో హెచ్చరిక సైరన్ మోగిస్తుంది. నిరంతరాయంగా పనిచేసేందుకు వీలుగా ఈ కెమెరాలకు సోలార్ ప్యానెళ్లు, బ్యాకప్ బ్యాటరీ వ్యవస్థలు ఉంటాయి.
ఈ ఘటనతో...
సరిగ్గా ఏడాది క్రితం తమిళనాడు కడలూరు వద్ద లెవల్ క్రాసింగ్‌ను దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొంది. ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రైలు వచ్చినా గేటు వేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. తాజాగా కోర్టు... స్టేషన్ మాస్టర్–గేట్‌కీపర్ మధ్య ఘటనకు ముందు జరిగిన ఫోన్ సంభాషణను పరిశీలించింది. అందులో గేట్ వేయటం మరిచిపోయానని పేర్కొన్న అంశం తెరపైకి వచ్చింది. దీనిపై వాయిస్ టెస్ట్‌కు కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం రైల్వే బోర్డును ఇప్పుడు పరుగుపెట్టిస్తోంది. వెంటనే. దేశవ్యాప్తంగా నాన్ ఇంటర్ లాకింగ్ గేట్ల వద్ద తక్షణం ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్ని జోన్లకు ఆదేశించింది.


