కారు లోపం కాదు.. సంజూష్‌ నిర్లక్ష్యమే | MP Lingamaneni Rameshs son Sanjushs negligence led to a fatal road accident | Sakshi
Sakshi News home page

కారు లోపం కాదు.. సంజూష్‌ నిర్లక్ష్యమే

Aug 30 2026 4:21 AM | Updated on Aug 30 2026 4:22 AM

MP Lingamaneni Rameshs son Sanjushs negligence led to a fatal road accident

రోడ్డు ప్రమాదానికి కారణమిదే.. 

సంజూష్ కు డీఎల్‌ జారీ అయి 88 రోజులే 

మోటార్‌ వాహన తనిఖీ అధికారుల నివేదికలో వెల్లడి 

తొలుత 6 నెలలపాటు డీఎల్‌ లైసెన్స్‌ రద్దు! 

సాక్షి, హైదరాబాద్‌: జనసేన ఎంపీ లింగమనేని రమేష్‌ కుమారుడు సంజూష్‌ నిర్లక్ష్యం వల్లే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టమైంది. నిందితుడు సంజూష్‌ నడిపిన లగ్జరీ కారు ఆస్టన్‌ మార్టిన్‌లో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక లోపం లేదని తేటతెల్లమైంది. ఈమేరకు రంగారెడ్డి జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) మాదాపూర్‌ పోలీసులకు మోటారు వాహన తనిఖీ (ఎంవీఐ) సమర్పించిన తుది నివేదికలో వెల్లడించారు. 

ఈనెల 16న మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా ఆస్టన్‌ మార్టిన్‌ కారులో దూసుకొచ్చిన సంజూష్.. రోడ్డు దాటుతున్న ఒడిశాకు చెందిన భారతి ముఖీని బలంగా ఢీ కొట్టడంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన తీరు, కారు మెకానికల్‌ పనితీరుపై సమగ్ర విచారణ కోరుతూ మాదాపూర్‌ పోలీసులు డీటీఓకు లేఖ రాశారు. దీంతో ఈనెల 21న మాదాపూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును ఠాణా పరిసరాల్లోనే మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి క్షుణ్నంగా తనిఖీ చేసి నివేదికను సమర్పించారు. 

బ్రేక్‌లు ఫెయిల్‌ కాలేదు 
సాధారణంగా ఇలాంటి లగ్జరీ కార్ల ప్రమాదాలు జరిగినప్పుడు ‘బ్రేక్‌లు పనిచేయలేదు’అనే సాకులు వినిపిస్తుంటాయి. కానీ, ఈ కేసులో ఆర్టీఏ అధికారులు ఆస్టన్‌ మార్టిన్‌ కారును క్షుణ్నంగా తనిఖీ చేసి ‘ఈప్రమాదం వాహన యాంత్రిక లోపాల వల్ల జరగలేదు’అని స్పష్టం చేశారు. ఫుట్‌ బ్రేక్, హ్యాండ్‌ బ్రేక్, పార్కింగ్‌ బ్రేక్‌లు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కారులోని డ్యాష్‌ బోర్డ్‌ కెమెరాలో రికార్డ్‌ అయిన ఆడియో, వీడియో ఫుటేజ్‌లను కూడా సమగ్ర విచారణ చేసి, నివేదిక అందించాలని మాదాపూర్‌ పోలీసులు లేఖ రాయనున్నారు. 

యూకే నుంచి కారు దిగుమతి.. 
సంజూష్‌ నడిపిన లగ్జరీ కారు ఆస్టన్‌ మార్టిన్‌ యూకే నుంచి దిగుమతి అయింది. గతేడాది జూలై 11న ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో టీజీ09 జీ0666 నంబరుతో హానర్‌ ప్రైమ్‌ హౌసింగ్‌ ఎల్‌ఎల్‌పీ, మేంపరాల ఐశ్వర్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. సంజూష్ కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌) వచ్చి రోడ్డు ప్రమాదం చేసిన రోజు నాటికి కేవలం 88 రోజులే అయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి మృతికి కారణమైన కారణంగా అతడికి ప్రస్తుతానికి డీఎల్‌ 6 నెలల పాటు రద్దవుతుందని, పోలీసుల విచారణ, కోర్టు తీర్పు అనంతరం డీఎల్‌ శాశ్వతంగా రద్దయ్యే అవకాశం కూడా ఉందని ఓ ఆర్టీఏ అధికారి స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement