పాల్గొన్న 6,500 మంది రన్నర్లు
దివ్యాంగ రన్నర్లతో కలిసి పరుగెత్తిన సైబరాబాద్ సీపీ
మాదాపూర్ (హైదరాబాద్): ఉల్లాసం, ఉత్సాహం ఉరకలేసిన రన్నర్లతో హైదరాబాద్ మారథాన్ సందడిగా సాగింది. శనివారం 15వ ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్–2026ను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహించారు. 300 మంది దివ్యాంగ రన్నర్లతో కలిపి 6,500 మందికిపైగా రన్నర్లు పాల్గొనడం విశేషం. ఈ రన్‌ను శనివారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ సృజన జెండా ఊపి ప్రారంభించారు. మారథాన్‌లో భాగంగా హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ వింగ్ రన్నర్లకు మొక్కలను పంపిణీ చేసింది.
కాగా ఈ ఏడాది నిర్వహించిన ఎడిషన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ సిల్వర్ సస్టేనబిలిటీ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న భారత తొలి మారథాన్‌గా ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ గుర్తింపు పొందింది. ఈ మారథాన్‌లో 300 మంది దివ్యాంగ రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 205 మంది వివిధ రకాల దివ్యాంగులు, తెలంగాణ వీల్‌చైర్ క్రికెట్ టీమ్, బెంగళూరు వీల్‌చైర్ క్రికెట్ టీమ్‌కు చెందిన 37 మంది వీల్‌చైర్ రన్నర్లు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు చెందిన మరుగుజ్జులు, దృష్టిలోపం ఉన్నవారు, ఇతర దివ్యాంగ రన్నర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ అంధుడు, పుణేకు చెందిన దివ్యాంశు గనాత్రా కూడా రన్‌లో పాల్గొన్నారు.
సందేశం అభినందనీయం: సీపీ: ‘సెల్‌ఫోన్ వద్దు–పుస్తకమే ముద్దు’అనే సందేశం అభినందనీయమన్నారు సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేశ్. పిల్లలు సెల్‌ఫోన్లలో ఎక్కువ సమయం కేటాయించకుండా పుస్తçకపఠనంపై ఆసక్తి పెంచుకునేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ కలియప్పన్, హెచ్‌ఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్–2026 రేస్ డైరెక్టర్ రాజేశ్ వెట్చా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ భ్యాంక్ జోన ల్ హెడ్ ప్రశాంత్ షిండే, ఎన్‌ఎండీసీ పర్సనల్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.


