నేపాల్: 1.6 లక్షల మహిళల పరిస్థితి దయనీయం | Nearly 1.6 Lakh Women and Girls Severely Hit by Nepal Flash Floods UN Women | Sakshi
Sakshi News home page

నేపాల్: 1.6 లక్షల మహిళల పరిస్థితి దయనీయం

Aug 31 2026 8:01 AM | Updated on Aug 31 2026 8:01 AM

Nearly 1.6 Lakh Women and Girls Severely Hit by Nepal Flash Floods UN Women

ఖాట్మండు: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 1.6 లక్షల మంది (1,57,050 మంది) మహిళలు, బాలికలు ఈ విపత్తు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావానికి గురైనట్లు ‘యూఎన్ విమెన్’ విభాగం తన మొదటి జెండర్ అలర్ట్ నివేదికలో వెల్లడించింది. వరదల కారణంగా వీరు హింస, దోపిడీ తదితర ముప్పులను కూడా ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ఈ విపత్తు తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని పేర్కొంటూ, వరదల ధాటికి 500 మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మంది గల్లంతయ్యారని, సుమారు 10,000 ఇళ్లు కొట్టుకుపోయాయని సంస్థ తెలిపింది. బతికి బయటపడిన వారు ఆహారం, తాగునీరు, వైద్యం, రక్షణ సేవల కొరతతో అల్లాడుతున్నారని వివరించింది. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాల్లోని మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నిరక్షరాస్యులుగా ఉన్నారని, దీనివల్ల సహాయ చర్యల వివరాలు తెలుసుకోవడం, నమోదు చేసుకోవడం, సహాయం పొందడంలో వారికి ఆటంకాలు ఎదురవుతున్నాయని నివేదిక వెల్లడించింది.

అంతేకాకుండా బాగమతి ప్రావిన్స్‌లోని కుటుంబాల్లో మూడింట ఒక వంతు కుటుంబాలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని, అందులో మూడో వంతు కుటుంబాలు విదేశీ ఆదాయం (రెమిటెన్స్‌)పైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొంది. విపత్తుల వేళ మహిళలు, బాలికలు ఎదుర్కొనే ముప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతాయని యూఎన్ విమెన్ ప్రతినిధి ప్యాట్రిసియా ఫెర్నాండెజ్-పచెకో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ ఆహార సాయం, జీవనోపాధి కల్పించేందుకు మహిళల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కిచెన్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. విపత్తు బారిన పడిన మహిళలు, బాలికల రక్షణ, పునరావాసం కోసం అత్యవసరంగా 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.7 కోట్లు) నిధులు సమకూర్చాలని యూఎన్ విమెన్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement