నేపాల్‌ను కుదిపేసిన వరద బీభత్సం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదని నేపాల్ ఆరోపించగా.. చైనా ఆ వాదనను కొట్టిపారేసింది. అయితే ఈ ప్రవాహం వేగం ఊహకందని రీతిలో ఉందని దూసుకొచ్చిందని.. అందుకే ముందస్తు హెచ్చరిక ఇవ్వడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అత్యంత కష్టంగా మారిందని తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి ఓ విపత్తు రావొచ్చని పది రోజుల కిందటే నేపాల్‌ను చైనా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 26న ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ విలయంలో 800 మంది మృతదేహాలను వెలికి తీయగా.. మరో 2,500 వేల మంది ఆచూకీ గల్లతైంది. అయితే దాదాపు 12 రోజుల ముందే టిబెట్ ప్రాంతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చైనా నేపాల్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాటితో పాటు కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ చైనాకు చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం నేపాల్‌కు ఓ మెయిల్ పంపింది. అలాగే హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలపై దృష్టిసారించాలని సూచించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
జస్ట్.. 26 నిమిషాల్లో?
ఆగస్టు 26న ఉదయం సుమారు 8.32 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద బీభత్సం మొదలైంది. కేవలం 26 నిమిషాల తర్వాత నేపాల్ అధికారులకు సమాచారం అందింది. అయితే వరద ధాటికి పలు పర్యవేక్షణ కేంద్రాలు ధ్వంసం కావడంతో డేటా ప్రసారం నిలిచిపోయింది. స్థానిక అధికారుల నుంచి నిర్ధారణ పొందిన తర్వాత నేపాల్ అధికారులు ఉదయం 9.13 గంటలకు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపారు. అప్పటికే వరద ట్రిషూలీ నది వెంట దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్తోంది.
అయితే నేపాల్ వాదన మరోలా ఉంది. చైనా ఆ హెచ్చరికలను 14-19 తేదీల మధ్యే అని ప్రస్తావించిందని అంటోంది. అలాగే తమకు కేవలం భారీ వర్షాల హెచ్చరికలు మాత్రమే జారీ చేసిందని, దానికి తాము ‘‘కేవలం వర్షపాతం సమాచారం మాత్రమే కాదని, హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలు, కొండచరియల ప్రమాదంపై ముందస్తు సమాచారం’’ కూడా కోరామని అంటోంది.
వరద స్పీడు.. మరీ అంతనా?
ఇదిలా ఉండగా.. తాజా అంచనాలు ఈ విపత్తు తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. నీరు, బురద, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు నేపాల్ హిమాలయ గ్లేసియర్, పర్వత పరిశోధకుడు ధనంజయ్ రెగ్మి తెలిపారు. ఇంతటి వేగంతో వచ్చిన ప్రవాహం మార్గంలో కనిపించిన ప్రతిదానినీ ఊడ్చుకెళ్లింది.
పర్వతారోహకుడు సంజిత్ సింగ్ బాల్ అంచనా ప్రకారం.. సుమారు ఒక కిలోమీటరు పరిమాణంలో ఉన్న హిమనదం భాగం దాదాపు 5,000 మీటర్ల ఎత్తు నుంచి విరిగిపడి కిందికి దూసుకొచ్చి ఉండొచ్చు. మార్గమధ్యంలో నీరు, మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను తనతో కలుపుకోవడంతో ప్రవాహం మరింత శక్తిమంతంగా మారింది.
అంత పెద్ద.. హిమనదం కూలింది
మొదట మూడు హిమ సరస్సుల్లో ఏదో ఒకటి తెగిపోవడం వల్లే ఈ వరద సంభవించిందని భావించారు. కానీ ఉపగ్రహ చిత్రాల పరిశీలనలో అసలు కారణం మరోటి అని తేలింది. సుమారు 7,000 మీటర్ల ఎత్తున్న లాంగ్‌టాంగ్ లెరుంగ్ శిఖరంలోని ఉత్తర హిమనదం(గ్లేసియర్)లో దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతం కూలిపోయినట్లు గుర్తించారు. హిమనదం భారీ భాగం లోయలోకి పడటంతో నీరు, మంచు, రాళ్లు, మట్టి కలిసి అత్యంత వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
మూడు సరస్సులు.. మరో ముప్పు?
తాజా విపత్తు తర్వాత.. ఆ రీజియన్‌లో మూడు సరస్సులు సహజంగా ఏర్పడడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వీటిలో ఏదైనా ఒకదానిపై కొత్తగా కొండచరియలు లేదంటే భారీ రాళ్లు పడితే.. దాని ప్రభావం వరుసగా మిగిలిన సరస్సులపైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇటు ప్రస్తుతం చైనా–నేపాల్ సరిహద్దు వద్ద ఏర్పడిన బ్యారియర్ సరస్సులోని నీరు సహజంగా బయటకు వెళ్లి దాదాపు పూర్తిగా ఖాళీ కావడంతో.. ఒక్కసారిగా సరస్సు తెగిపోయి భారీ వరద వచ్చే ముప్పు గణనీయంగా తగ్గింది. అలాగని.. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అటు చైనా, ఇటు నేపాల్ అధికారులు అంటున్నారు.
నేపాల్‌లోని భోటేకోషి నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నదీ ప్రవాహంలో ఆకస్మిక మార్పులు, కొండచరియలు లేదంటే కొత్తగా ఏర్పడే నీటి నిల్వలపై నిఘా కొనసాగుతోంది. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోనే ఉండాలని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.
800 మంది మృతి.. మిస్సింగ్ లెక్క వేరే!
ఈ వరదలో నేపాల్, చైనాలో కలిపి దాదాపు 800 మంది మరణించగా.. 2,500-3,000 మందికిపైగా గల్లంతైనట్లు తాజా సమాచారం. వరద ధాటికి భారీ బండరాళ్లు, బురదతో భవనాలు కొట్టుకుపోయాయి. మొత్తంగా 19 వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతానికిపైగా ప్రభావితమైనట్లు అంచనా. సరిహద్దు నుంచి సుమారు 168 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. దాదాపు 5.74 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఈ ప్రవాహంలో ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది.
చైనాతో మరింత సమాచార భాగస్వామ్యం
నేపాల్ ఆరోపణలు-చైనా కౌంటర్‌లతో ముందస్తు వార్నింగ్‌లపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ విపత్తు నేపథ్యంలో హిమనదాలు, హిమ సరస్సులు, నదుల ప్రవాహంపై చైనాతో మరింత సమగ్ర సమాచార భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ భావిస్తోంది. ప్రతి 10 నిమిషాలకోసారి వర్షపాతం, నదుల నీటిమట్టం, హిమనదాల కదలికలపై సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వాతావరణ మార్పులతో హిమనదాల కరుగుదల వేగం పెరుగుతున్న నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో వరదలు, కొండచరియలు, హిమ సరస్సుల ఉప్పెనల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే మూడు కొత్త సరస్సులు మరో ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది.
ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ప్రాణాలు కాపాడిన ఛాయ్!


