పూర్వకాలం నాటి ఆరోగ్యకరమైన పద్ధతులు సదా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అవి సాధారణ మందులు, ఆధునిక చికిత్సలకు మించి ప్రభావవంతంగా ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ ఆయుర్వేద ధూమపానం. ఇది సాధరణ స్మోకింగ్ లాంటిది కాదు. ఆరోగ్యాన్ని చేకూర్చే మూలికల ధూమపానం. దీన్ని నటి, కంటెంట్ క్రియేటర్ షెనాజ్ ట్రెజరీ ప్రయత్నించి మరి ఆ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు.
ఇలాంటి ఆయుర్వేద చికిత్స ఒకటి ఉందని తనకు తెలియదని చాలా అద్భుతంగా ఉందంటూ నాటి చికిత్స విధానంపై ప్రశంసల జల్లు కురిపించింది. వైద్యపరమైన ధూమపానానికి స్వాగతం అంటూ..ఇది మన ఇంద్రియాలను, ముఖ్యంగా నాసికా మార్గాల్లోని అడ్డంకులను తొలగించి మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుందని అంటోంది. ఇది నిర్థిష్ట ఔషధ మూలికల నుంచి వచ్చే పొగను పీల్చే పద్ధతి, చూడటానికి అచ్చం ధూమపానం మాదిరిగా ఉంటుంది.
దెబ్బతో తల, ముక్కు, గొంతు సమస్యలు దెబ్బకు పరార్ అని అంటోంది షెనాజ్ . పూర్వకాలంలో శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వాత, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి ఔషధ గుణాలున్న మూలికల పొగలను పీల్చే ఒక ప్రాచీన పద్ధతిని ఉపయోగించేవారట. ఈ విధానంలో పసుపు, గుగ్గులు, వేప, నెయ్యి వంటి స్వస్థత చేకూర్చే పదార్థాలతో నింపిన ప్రత్యేకంగా తయారు చేసిన మూలికల వత్తిని కాలుస్తారు.
దాన్ని ముక్కు రంధ్రాల ద్వారా పీల్చి, నోటి ద్వారా మాత్రమే బయటకు వదులుతారు. దీని వల్ల శ్లేష్మం తొలిగి ముక్కు, గొంతులోని చికాకు తగ్గి అత్యంత రిలీఫ్‌గా ఉంటుందట. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు చురుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుందట.
(చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..)


