వయసు అనేది కేవలం క్యాలెండర్లో మారే సంఖ్యే తప్ప.. మనిషి కనిపించే తీరుకు, ఆలోచించే విధానానికి అది కొలమానం కాదని నిరూపిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులోనూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. మరి ఈ యవ్వన రహస్యం ఏంటి? దానికి నాగార్జున చెప్పిన సమాధానం ఏమిటి? గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను నాగార్జున స్వయంగా వెల్లడించారు. తన మాటల్లోనే..
ఇదీ చదవండి: ‘కింగ్100’ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్

రోజు మొదలయ్యేది అలా..
👉 ఉదయం లేవగానే వర్కౌట్స్ చేయడం అలవాటు. జిమ్‌కు వెళ్లడం కుదరని రోజుల్లో వాకింగ్ లేదా స్విమ్మింగ్‌ను ఎంచుకుంటా. ఏదో ఒక కారణంతో వ్యాయామాన్ని మాత్రం వదులుకోను.వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా వర్కౌట్ చేస్తా. రోజుకు సుమారు గంటా 45 నిమిషాల పాటు వ్యాయామానికి సమయం కేటాయిస్తా. నిద్ర విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటా’ అని తెలిపారు. దీంతో పాటు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం కూడా ఫిట్‌నెస్ రొటీన్‌లో భాగమని తెలిపారు.
👉 యంగ్‌గా కనిపించడానికి వర్కౌట్స్ ఒక్కటే సరిపోవు. మంచి ఆహారం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తీసుకోవడం నాకు అలవాటు. చికెన్, మటన్, ఫిష్ అన్నీ తింటా. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటా. ఆలస్యం చేయకుండా ఏడు లేదా ఏడున్నర గంటలలోపే పూర్తి చేసేస్తా.

ఎప్పుడూ డైట్‌లో ఉండాల్సిన అవసరం లేదు
👉 ఎప్పుడూ డైట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఆదివారం అయితే నచ్చిన ఆహారాన్ని ఇష్టంగా తింటా. స్వీట్స్ అంటే చాలా ఇష్టం. రాత్రి వేళల్లో స్వీట్స్ ఎక్కువగా తింటా. స్వీట్ తినకపోతే నాకు రాత్రి నిద్ర పట్టదు. తినాలనిపించినప్పుడు ‘డైట్’ అనే ఆలోచనే రాదు. నచ్చింది తినాలనిపించినా.. ఏదైనా తాగాలనిపించినా.. వెంటనే చేసేస్తా. అయితే వర్కౌట్స్ క్రమం తప్పకుండా చేస్తూ ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను.
గోల్ఫ్ ఎందుకంటే..
👉 నాగార్జున ఫిట్‌నెస్ జాబితాలో గోల్ఫ్ కూడా ఉంది. గోల్ఫ్ ఆడటం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని.. మానసికంగా కూడా తనకు ఎంతో ఉపయోగపడుతుందని నాగార్జున చెబుతున్నారు. గేమ్‌లో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానిని సాధించేందుకు ప్రయత్నించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇదీ చదవండి: బిగ్‌బాస్ సీజన్-10.. హౌస్‌లోకి చెన్నై లవ్ స్టోరీ నటుడు..!


