విచారణకు సుప్రీంకోర్టు ఓకే
నిపుణుల కమిటీ ఏర్పాటుకు డిమాండ్
అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలి
న్యూఢిల్లీ: పెట్రోలులో ఇథనాల్ శాతాన్ని ప్రతి పంపుపైనా ప్రదర్శించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 31) విచారణ జరపనుంది. జస్టిస్ ఎం.ఎం.సుంద్రేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల బెంచ్ ఈ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు కాజ్‌లిస్ట్ ద్వారా తెలిసింది. నరేంద్ర కుమార్ గోస్వామీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో పెట్రోలు బిల్లులపై కూడా ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా... ఏ వాహనానికి ఏ రకమైన పెట్రోలు, ఇథనాల్ మిశ్రమం పనిచేస్తుందో చూపే ఒక జాబితాను తయారు చేసేలా (కేంద్రం, ఇతరులు) ఆదేశాలివ్వాలని ఈ జాబితాలో తయారీదారు ఎవరు? మోడల్, ఇంజిన్ రకం, తయారైన సంవత్సరం వంటి విషయాలన్నీ పొందుపరిచి.. వెతికేందుకు అనువుగా ఉండేలా సిద్ధం చేయాలని కోరారు. ఈ20 పెట్రోలును వాడుతున్న వాహనాలను పరిశీలించి ఒక నివేదిక సమరి్పంచేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’తోపాటు స్వతంత్ర ఆటోమొబైల్ ఇంజినీర్లతో ఒక నిపుణల కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కమిటీ ఈ20 పెట్రోలు వాడుతున్న వాహనాల మైలేజీ, ఇంజిన మన్నిక, నిర్వహణ ఖర్చులు, వారంటీ, బీమా తదితర అంశాల ప్రభావాన్ని కూడా మదింపు చేసి నివేదిక సమరి్పంచేలా చూడాలని కోరారు. ఇథనాల్ ఉత్పతికి అయ్యే నీటి ఖర్చు, ఈ20 పెట్రోలు వాహనాలతో వెలువడే కాలుష్యం, ఆహార భద్రత, పెట్రోలులో కలిపేందుకు పశుదాణాతో ఇథనాల్ తయారీ ఆరోపణలపై కూడా విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు. ఇథనాల్ మిశ్రిత పెట్రోలుకు సంబంధించిన విధానపత్రాలు, సాంకేతిక అధ్యయనాలు, భద్రత ప్రమాణాలు, వినియోగదారులకిచి్చన సలహా, సూచనల వంటి అన్ని వివరాలను సుప్రీంకోర్టు ముందుంచాలని డిమాండ్ చేశారు. నిర్దిష్ట కాలావధిలోగా ఈ20 వినియోగానికి సరిపోని వాహనాల నుంచి సరిపోయే వాహనాలకు మళ్లేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని కోరారు.


