ఫుట్‌పాత్‌లు మన జీవితంలో ఓ భాగం  | Supreme Court emphasizes the importance of encroachment-free footpaths | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌లు మన జీవితంలో ఓ భాగం 

Aug 25 2026 6:36 AM | Updated on Aug 25 2026 6:38 AM

Supreme Court emphasizes the importance of encroachment-free footpaths

ఆక్రమణల్లేని నడకదారుల కోసం ఏం చర్యలు తీసుకున్నారు? 

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు 

న్యూఢిల్లీ: రహదారులకు ఇరుపక్కల ఉండే నడక దారులు మనిషి జీవితంలో విడదీయరాని భాగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వేచ్ఛగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆక్రమణలకు తావులేని విధంగా ఫుట్‌పాత్‌లను నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుపై ఏం చర్యలు తీసుకున్నదీ తెలపాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. 

రహదారి ఉన్న ప్రతి చోటా పక్కాగా నడకదారి ఉండాలనే అంశంపై సోమవారం జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధేల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది.‘స్పష్టంగా గుర్తించిన కాలిబాటలుండటం మొదటి అంశం. ఆ దారుల్లో నడక సురక్షితమని ప్రజలు భావించాలి. ఎక్కడ రోడ్డు ఉన్నా స్పష్టంగా గుర్తించిన ప్రాంతంలో ప్రజలు నడిచే వీలుండాలి’అని విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ తెలిపారు.

 ‘రహదారుల అంశం రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున, రోడ్డు, రవాణా, హైవేల శాఖ, గృహ, పట్టణ వ్యవహారాల శాఖలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంటాయి’అని ఆయన వివరించారు. స్పందించిన ధర్మాసనం.. ఫుట్‌పాత్‌లు జన జీవితంలో అంతర్భాగాలని పేర్కొంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. 

గత విచారణ సందర్భంగా  
స్కూలుకు తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదేళ్ల తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇందుకుగాను పరిహారం ఇవ్వాలంటూ ఓ తండ్రి వేసిన పిటిషన్‌పై జూన్‌ 19న, తిరిగి ఆగస్ట్‌ 3వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రహదారులపై సురక్షితమైన, స్పష్టంగా గుర్తించిన కాలిబాటలు ఉండటం పౌరుల ప్రాథమిక హక్కు అని పేర్కొన్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement