68 ఏళ్ల వయసులో హత్య
దోషిగా నిర్ధారణ..జైలు శిక్ష
2024లో మధ్యంతర బెయిల్
తాజాగా మిగిలిన శిక్ష రద్దు, విడుదల
న్యూఢిల్లీ: హత్య కేసులో దోషిగా నిర్ధారితమైన వ్యక్తికి సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ ఖరారు చేసింది. మిగిలిన శిక్షకాలాన్ని కూడా మాఫీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తుదితీర్పునిస్తూ.. పిటిషనర్ వయసును పరిగణలోకి తీసుకుని కేసు మూసివేయాలని తీర్మానించినట్లు తెలిపింది.
శిక్షాకాలం ఏదైనా మిగిలి ఉన్నా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘జీవితఖైదు అవధి ముగియకున్నా అతడిని మళ్లీ కస్టడీలోకి తీసుకోకూడదు’’అని సీజేఐ స్పష్టం చేశారు. 2024లో ఇచి్చన మధ్యంతర బెయిల్‌ను పూర్తిస్థాయి, చివరి బెయిలుగా ఖరారు చేసింది. ‘‘మధ్యంతర ఉత్తర్వు రూపంలో రసిక్ చంద్ర మోండల్ మధ్యంతర బెయిల్/పెరోల్ కింద విడుదల అవుతారు. అతడిపై ప్రస్తుతమున్న రిట్ పిటిషన్ తేలేంతవరకూ ట్రయల్‌కోర్టు తగిన షరతులు విధించవచ్చు’’అని వివరించింది.
1988లో అరవై ఎనిమిదేళ్ల వయసులో రసిక్ చంద్ర మోండల్‌పై హత్యాభియోగం నమోదు కాగా కోర్టు అతడిని 1994లో దోషిగా నిర్ధారించింది. సుదీర్ఘమైన జైలు శిక్ష తరువాత సుప్రీంకోర్టు అతడికి 2024 నవంబరు 29న బెయిల్ మంజూరు చేసింది. 1920లో పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాలో జన్మించిన మోండల్ వయసు ఇప్పుడు 105 ఏళ్లు. హత్యాభియోగాన్ని సవాలు చేస్తూ మోండల్ వేసిన కేసును కలకత్తా హైకోర్టు 2018లో కొట్టివేయగా ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది.


