వారు ఇచ్చే తీర్పులన్నీ సరైనవే అనుకోవద్దు
వీడ్కోలు సభలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ కరోల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయమూర్తులు దేవుళ్లు కారు, వారు ఇచ్చే ప్రతి తీర్పు సరైనదే అనుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ అన్నారు. ఆయన పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ కరోల్ ప్రసంగించారు. న్యాయాన్ని నిగ్గు తేల్చడానికి కొంత వినయం, మానవత్వం, అలాగే ప్రతివాది వెనుక ఉన్న నిజమైన వ్యక్తిని చూడగల సామర్థ్యం అవసరమని చెప్పారు.
జడ్జీలను రాజ్యాంగం కేవలం చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలని మాత్రమే కోరడం లేదని.. దాన్ని న్యాయబద్ధంగా అమలు చేయాలని కోరుతోందని తెలిపారు. చట్టపరంగా ఎవరు సరైనవారో నిర్ణయించడం కంటే, తీర్పు చెప్పే బాధ్యత తనకు ఎల్లప్పుడూ చాలా పెద్దదిగా అనిపించిందని పేర్కొన్నారు. ఒక పిటిషన్ సంబంధిత కేసులోని వాస్తవాలను మాత్రమే చెప్పగలదని వెల్లడించారు.
కానీ, ఆ పిటిషనర్ ఇప్పటికే ఏమి కోల్పోయాడో, కోర్టుల నుంచి అతడు ఏమి ఆశిస్తున్నాడో పిటిషన్ చెప్పలేదని వ్యాఖ్యానించారు. అందుకే తీర్పు చెప్పడానికి కొంత మానవత్వం అవసరమని ఉద్ఘాటించారు. జస్టిస్ కరోల్ 2023 ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పదవీకాలంలోని చివరి రోజున ఏర్పాటు చేసిన లాంఛనప్రాయ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తోపాటు జస్టిస్ కరోల్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన ఉన్నారు.
న్యాయవాద వృత్తిలో దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని జస్టిస్ కరోల్ గుర్తుచేసుకున్నారు. కోర్టు గది తనకు ఎన్నడూ కేవలం ఒక కార్యస్థలం మాత్రమే కాదని.. అది తనకంటే గొప్పదైన, ముఖ్యమైన మరొకదాని కోసమేనని భావించానని తెలిపారు. 40 ఏళ్లపాటు కోర్టు గదుల్లో గడిపానని, మొదట్లో ధర్మాసనం ముందు హాజరయ్యే న్యాయవాదిగా, గత 19 ఏళ్లుగా న్యాయమూర్తిగా పనిచేశానని వివరించారు. వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ కరోల్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ రాయ్ తదితరులు ఘనంగా సత్కరించారు.


