భగ్గుమంటున్న చక్కెర | India tightens sugar stock limits as prices hit record high ahead of festive season | Sakshi
Sakshi News home page

భగ్గుమంటున్న చక్కెర

Aug 23 2026 6:13 AM | Updated on Aug 23 2026 6:13 AM

India tightens sugar stock limits as prices hit record high ahead of festive season

రూ.65కి చేరిన కిలో ధర ∙నెల రోజుల్లోనే 8%, ఏడాదితో పోలిస్తే 13% పెరుగుదల

కొరతకు ఇథనాల్‌ (ఈ20) విధానమే కారణమంటున్న నిపుణులు

తోసిపుచ్చిన కేంద్రం.. తెగుళ్లు, అక్రమ నిల్వలే ప్రధాన కారణమని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కిలో ధర ఏకంగా రూ.65కి చేరు కుంది. రానున్నది పండుగల సీజన్‌ కావడంతో చక్కెరకు డిమాండ్‌ మరింత పెరగనుంది. మిఠా యిలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తయారీకి చక్కెర అత్యంత కీలకం. సరిగ్గా ఈ సమయంలోనే రేట్లు ఆకాశాన్ని తాకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలకు ప్రధానంగా ఇథనాల్‌ (ఈ20) ఉత్పత్తి కోసం చెరకును భారీగా మళ్లించడమే కారణమని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఈ వాదనను తోసిపుచ్చింది. వాతావరణ పరిస్థితులు, వ్యాపారుల అక్రమ నిల్వలే ధరల మంటకు కారణమని స్పష్టం చేసింది. 

రికార్డు స్థాయిలో మోత 
దేశవ్యాప్తంగా రిటైల్‌ మార్కెట్లలో పంచదార ధరలు అర్ధ సెంచరీ దాటేశాయి. 2023 ఆరంభంలో కిలోధర రూ.40 నుంచి రూ.45 వరకు ఉండగా, ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో సగటున రూ.51.7 నుంచి రూ.52.3కు చేరుకుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 7 నుంచి 8 శాతం మేర ధరలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 12 నుంచి 13 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రాలు, నాణ్యతను బట్టి ఈ ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్‌ లాంటి రాష్ట్రాల్లో కిలో చక్కెర ఏకంగా రూ.65 పలుకుతుండగా.. ముంబై, భోపాల్‌ తదితర ప్రాంతాల్లో రూ.58 నుంచి రూ.63 వరకు విక్రయిస్తున్నారు.

ఇథనాల్‌ లక్ష్యమే ముప్పు తెచ్చిందా?
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం (ఈ20 ప్రాజెక్టు) ద్వారా విదేశీ ముడి చము రు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చెరకును ఇథనాల్‌ తయారీకి పెద్ద ఎత్తున మళ్లిస్తున్నారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో 1,822 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేలా ప్రభుత్వం డిస్టిలరీల నిర్మాణాన్ని ప్రోత్సహించింది. 

ఆల్‌ ఇండియా డిస్టిలర్స్‌ అసోసియేషన్‌ (ఏఐడీఏ) గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌ లో 30 నుంచి 35 శాతం కేవలం చెరకు ద్వా రానే వస్తోంది. ఇలా భారీ స్థాయిలో చెరకును ఇంధన అవసరాలకు మళ్లించడం వల్లే చక్కెర మార్కెట్‌లో సరఫరా తగ్గి, ధరలు పెరుగుతు న్నాయని వ్యవసాయ, ఆర్థిక నిపుణులు చెబు తున్నారు. ఇంధన భద్రత పేరుతో ఆహార భద్రతను ప్రమాదంలో పడేయకూడదని, ‘ఫుడ్‌ వర్సెస్‌ ఫ్యూయల్‌’ విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ సైతం ఇటీవల సూచించడం గమనార్హం. 

కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం 
ఇథనాల్‌ తయారీ వల్లే చక్కెర ధరలు పెరుగుతున్నాయన్న వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 2022–23లో 12 శాతంగా ఉన్న చెరకు మళ్లింపు, 2025–26 నాటికి 9 శాతానికి తగ్గిందని అధికారిక గణాంకాలతో సహా వెల్లడించింది. ఇథనాల్‌లో అత్యధిక భాగం మొక్కజొన్న తదితర ధాన్యాల నుంచే వస్తోందని స్పష్టం చేసింది. చక్కెర ధరల పెరుగుదలకు ప్రధాన కారణం దేశీయంగా ఉత్పత్తి తగ్గడమే కారణమని ప్రభుత్వం పేర్కొంది.

 దేశంలో చెరకు పంటకు ఎర్ర కుళ్లు (రెడ్‌ రాట్‌), టాప్‌ బోరర్‌ లాంటి వ్యాధులు సోకడం, భారీ వర్షాల వల్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోవడం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడించింది. దీనికి తోడు పండుగల సీజన్‌ దృష్ట్యా డిమాండ్‌ అమాంతం పెరగడం, కొందరు వ్యాపారులు, మిల్లుల యజమానులు కృత్రిమ కొరత సష్టించేందుకు అక్రమంగా నిల్వ చేయడం వల్లే ధరలు పెరిగాయని వివరించింది.

చక్కెర ధరలు పెరుగుతున్నాయెందుకు?
కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా మోదీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. ధరలను నియంత్రించేందుకు ఎటు వంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తింది. మూడు నెలల వ్యవధి లోనే 40 శాతం మేర చక్కెర పెరిగిందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని, ప్రభుత్వాన్ని క్షమించరని వ్యాఖ్యానించింది. పెరుగుతున్న చక్కెర ధరలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తరచూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారని తెలిపింది. చెరకును ఈ20 పెట్రోల్‌ కలిపే ఇథనాల్‌ ఉత్పత్తి కోసం వాడటమే ఇందుకు కారణమా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. గత 9 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చక్కెర నిల్వలు కనిష్ట స్థాయికి ఎందుకు పడిపోయాయని, ప్రస్తుతం దిగు మతులు చేసుకునే పరిస్థితి రావడానికి ఎవరు కారణమని నిలదీసింది. పండగల సీజన్‌లో చక్కెర ధరలను అదుపు చేసేందుకు, ఈ20 విధానంపై సమీక్ష చేపట్టాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement