‘‘ఉపాధి హామీ పథకం కింద బావి తవ్వేందుకు అనుమతి కావాలా... రూ.20,000’’.
‘‘ప్రభుత్వ సబ్సిడీతో పశువుల కొట్టం కట్టాలనుకుంటున్నారా?... రూ.7,000’’.
లాథూర్: ఓ గ్రామ సర్పంచ్ నోట్లోంచి వచ్చిన మాటలివి. ఆ డబ్బు ఎవరికీ అన్నది మీ డౌటా? ఇంకెవరికి సంబంధిత అధికారులకేనని, అంత మొత్తం లంచం ఇస్తే కానీ పనులు కావడం లేదని సర్పంచ్ ఆనాటి గ్రామ సభలో చెప్పాడు. ఈ గ్రామసభ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అధికారులు నాలుక్కరుచుకుని...‘‘లంచాలకు సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వండి.. చర్య తీసుకుంటాం’’అని గంభీరంగా చెబుతున్నారు.
మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, చకూర్ తహశీల్, అటోలా గ్రామంలో ఆగస్టు పదిహేడున ఈ ఘటన చోటు చేసుకుంది. వేర్వేరు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? అని గ్రామస్తులు సర్పంచ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయన ఈ లంచాల చిట్టా విప్పక తప్పింది కాదు. పంచాయతీ సమితి సభ్యులతోపాటు అధికారుల చేతులూ తడిపితేగానీ పనులు కావడం లేదని సర్పంచ్ చెప్పుకొచ్చాడట.
ఉపాధి హామీ పథకం కింద బావి తవ్వుకునేందుకు అనుమతి కావాలంటే రూ.20 వేలు, పశువుల కొట్టానికైతే రూ.ఏడు వేలు అవసరమవుతాయని, బావి విషయంలోనైతే పంచాయతీ సమితి సభ్యులు రూ.15 వేలకు సర్దుకుంటారని, మిగిలిన రూ.ఐదు వేలను ఇంటి, నీటి పన్ను బకాయిల కింద జమచేస్తారని కూడా సర్పంచ్ వివరించారు. అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గ్రామసభ సమావేశాలను వీడియో తీయమని స్వయానా సర్పంచే చెప్పడం.
‘‘ఈ సత్యం ప్రపంచం మొత్తానికి తెలియాల్సిందే’’అని కూడా ఆయన మాట్లాడటం వీడియోలో రికార్డయింది. అయితే ఈ విషయమై అధికారులు మాత్రం అంత సంతృప్తిగా ఏమీ లేరు. ‘‘లంచాలకు సంబంధించిన ఆధారాలు మూడు రోజుల్లో ఇవ్వాలని, ఎవరికి? ఎప్పుడు లంచమిచ్చారో రాతపూర్వకంగా తెలపాలని, చకూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సంతాజి మానె ఇప్పటికే గ్రామ సర్పంచ్‌ను కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. పౌరులు ఎవరూ పనుల కోసం పంచాయతీ సమితికి డబ్బులు ఇవ్వరాదని కోరారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సలహా కూడా ఇచ్చారు.


