ఫారమ్‌-6పై సుప్రీంకోర్టు చివాట్లు.. వెనక్కి తగ్గిన కేంద్ర ఎన్నికల సంఘం! | Election Commission Responds to Allegations Over Removal of 13.39 Crore Votes | Sakshi
Sakshi News home page

ఫారమ్‌-6పై సుప్రీంకోర్టు చివాట్లు.. వెనక్కి తగ్గిన కేంద్ర ఎన్నికల సంఘం!

Oct 7 2026 2:47 PM | Updated on Oct 7 2026 3:35 PM

Election Commission Responds to Allegations Over Removal of 13.39 Crore Votes

సాక్షి,న్యూఢిల్లీ : ఎస్‌ఐఆర్‌ రద్దు, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా 13.39 కోట్ల ఓట్ల తొలగింపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. మరోవైపు, కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ‘ఫారం-6’లో నిబంధనల మార్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వివాదంపై మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫారం-6తో పాటు అదనపు డిక్లరేషన్‌ను (పూర్వీకుల వివరాలు తదితర షరతులు) తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన ఈ ఫారమ్‌లో మార్పులు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దీని వెనుక ఎవరున్నారు? అంటూ నిలదీసింది.

అయితే, ఎస్‌ఐఆర్ నిబంధనల ప్రకారమే ఆ అదనపు వివరాలు కోరామని ఈసీ వాదించినప్పటికీ.. వివాదం ముదరడంతో కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్ పోర్టల్ నుంచి ఆ అదనపు డిక్లరేషన్ ఆప్షన్‌ను ఈసీ వెనక్కి తీసుకుంది. 

ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నవారందరూ తొలగించినట్లేనా? 
ఈసీ వర్గాల సమాచారం ప్రకారం.. ముసాయిదా జాబితాలో గుర్తించిన సుమారు 13.39 కోట్ల ఎంట్రీలను వివిధ కారణాల రీత్యా 'ఏఎస్‌డీడీ' కింద వర్గీకరించారు. ఇందులో ఒక్కో వర్గానికి సంబంధించిన లెక్కలు ఇలా ఉన్నాయి.

శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు : 6.30 కోట్లు  
గైర్హాజరైనవారు,ఆచూకీ లభించని ఓటర్లు : 3.01 కోట్లు
మరణించిన ఓటర్లు: 2.80 కోట్లు
డూప్లికేట్ (నకిలీ) ఓటర్లు: 1.02 కోట్లు
ఇతర కేటగిరీలకు చెందిన ఓటర్లు : 0.26 కోట్లు. 

అయితే, ఈ ఓటర్లను ఓట్ల జాబితా నుంచి తొలగించినట్లు భావించరాదని, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన తదనంతరం నిబంధనల ప్రకారమే తుది చర్యలు ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. ఈసీఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి ఏకపక్ష ధోరణి లేదని, పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో మొత్తం 95.40 కోట్ల మంది ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పక్కాగా జాబితాలు సిద్ధం చేసేందుకు 10 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) శ్రమించారు. అలాగే, పూర్తి పారదర్శకత కోసం 22 లక్షలకు పైగా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులకు (బీఎల్‌ఏలు) జాబితాలను అందజేశారు.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు,పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ఒక నెల రోజుల గడువు ఇవ్వడం జరిగిందని ఈసీ గుర్తుచేసింది. ఈ ప్రత్యేక పరిశీలన, సవరణ ప్రక్రియలో ఎవరి పేరైనా పొరపాటున జాబితా నుంచి తొలగించినా, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును పునరుద్ధరించుకోవచ్చు. లేదంటే కొత్తగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.   

ఇదీ చదవండి : SIR పేరుతో అసలేం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement