వ్యవసాయ వర్సిటీ పేపర్ లీకేజీ ఉదంతంలో ప్రొఫెసర్ అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వరంగ ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ వ్యవసాయ వర్సిటీకి సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో ప్రొఫెసర్ యోగేశ్ సోనకేసరియా ఒక ఎండోస్కోపిక్ కెమెరాను ఉపయోగించిన విషయం వెలుగులోకి వచ్చింది. క్వశ్చన్ పేపర్ లీకేజీ ఉదంతంలో యోగేశ్‌తోపాటు ఐదుగురు విద్యార్థులను శనివారం పోలీసులు అరెస్ట్‌చేశారు. ప్రశ్నపత్రం ఉన్న సీల్డ్ కవర్‌ను కాలేజీలో సమర్పించకుండా ఈయన నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు.
సీల్డ్ కవర్‌కు సూదితో చిన్న రంధ్రంచేసి అందులోంచి సూక్ష్మ ఎండోస్కోపిక్ కెమెరా జొప్పించి ప్రశ్నలను రికార్డ్ చేశారు. వాటిని తర్వాత టైప్ చేసి క్వశ్చన్ పేపర్ నకలు సిద్ధంచేశారు. వీటిని ముగ్గురు విద్యార్థులకు రూ.11,000కు అమ్మేశాడు. 20వ తేదీన జరిగిన బీఎస్సీ అగ్రికల్చర్ రెండో ఏడాది ఎంటమాలజీ సబ్జెక్ట్ పేపర్ లీక్ అయిన విషయం తెల్సిందే. వర్సిటీ అధికారులు, పలువురు విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 36 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌చేయడం గమనార్హం.
మధ్యప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల ప్రొఫెసర్ యోగేశ్ ప్రస్తుతం దుర్గ్ జిల్లాలోని భారతి అగ్రికల్చర్ కాలేజీలో ఏడేళ్లుగా పనిచేస్తూ ఈ లీకేజీలో ప్రధాన సూత్రధారునిగా ఉన్నాడు. తన కాలేజీలో నిర్వహించాల్సిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను రాయ్‌పూర్‌లోని జోరాలోని వ్యవసాయ కళాశాల నుంచి తెస్తుంటారు. 17వ తేదీన వాటిని కాలేజీలో సమర్పించకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. సూదితో చిన్న రంధ్రం చేసి ఎండోస్కోపిక్ కెమెరా పంపి తద్వారా ప్రశ్నలను చోరీచేశాడు. ఈ ఘటనలో పోలీసులు రూ.11వేల నగదు, ఆరు మొబైళ్లు, ఒక వీడియో రికార్డర్‌ను స్వా«దీనంచేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు పరారీలో ఉన్నారు.


