నేతృత్వం వహించనున్న జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి
సభ్యులుగా ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు, ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు
ప్రకటించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ‘చలో సంసద్’ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి, తీవ్ర అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి(హైపవర్డ్) కమిటీని ఏర్పాటు చేసింది.
ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి నేతృత్వం వహిస్తారు. పంజాబ్–హరియాణా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శైలేందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.
గత నెలలో ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్’ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వంలో గురువారం హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది.
నైపుణ్యం, అనుభవం ప్రాతిపదికగా..
నైపుణ్యం, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నిరసన సమయంలో జరిగిన సంఘటనలను సమగ్రంగా అంచనా వేయడంలో కమిటీ సిఫార్సులు కోర్టుకు సహాయపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. కమిటీ అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి, కోర్టుకు మధ్యంతర నివేదికలను సమర్పిస్తుందని వెల్లడించింది.
జస్టిస్ సుభాష్ రెడ్డికి విశేష అనుభవం
న్యాయ రంగంలో జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డికి విశేషమైన అనుభవం ఉంది. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవల పునరుద్ధరణ, ప్రాథమిక హక్కులపై వచ్చిన అనురాధ భాసిన్ కేసుతోపాటు కీలక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా వ్యవహరించారు. తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం ఆయన స్వస్థలం. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
1980లో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసుకున్న ఆయన రాజ్యాంగం, సివిల్, క్రిమినల్ వ్యవహారాల్లో పలు కేసులు వాదించారు. 2002 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2004 జూన్‌లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2018న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి తెలంగాణ వ్యక్తి జస్టిస్ సుభాష్‌రెడ్డే కావడం విశేషం. 2022 జనవరి 4న పదవీ విరమణ పొందారు.
హైపవర్ కమిటీ దర్యాప్తు చేసే అంశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చల్ సంసద్’ర్యాలీ సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసన రణరంగంగా మారింది. విద్యార్థులు బారికేడ్లను బద్దలుకొట్టి పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడమేగాక బాష్పవాయువు గోళాలను, పెల్లెట్ గన్లను ప్రయోగించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ హింసకు సంబంధించి పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ పోలీసుస్టేషన్లలో పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాలపై పలువురు నిరసనకారులపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ పలు అంశాలపై దర్యాప్తు చేయనుంది.
→ మహిళా నిరసనకారుల భద్రత: మహిళా నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని జరిగిన హింస, వేధింపులు, అసభ్యకర ప్రవర్తన ఆరోపణలపై అధ్యయనానికి కమిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.
→ పోలీసుల అతి బలప్రయోగం: పోలీసులు, భద్రతా సిబ్బంది అతి బలప్రయోగం వల్ల నిరసనకారులకు తీవ్ర గాయాలు కావడం, ఆ చర్యలకు దారితీసిన వరుస ఘటనలు, వాటికి బాధ్యులు ఎవరు, బలప్రయోగంలో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించారా? అనే కోణంలో కమిటీ పరిశీలిస్తుంది.
→ ఆయుధాల వాడకం: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా పెల్లెట్ గన్లు ప్రయోగం, ఎలక్ట్రిక్ లాఠీలు ఉపయోగించడం, లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంపై కమిటీ విచారణ జరుపుతుంది.
→ యూనిఫాం నిబంధనలు: నిరసనకారులను అరెస్టులు చేసేటప్పుడు లేదా బలప్రయోగం చేసేటప్పుడు పోలీసులు, భద్రతా సిబ్బంది సరైన యూనిఫాం, దానిపై కనిపించే విధంగా నేమ్‌ప్లేట్లు ధరించారా లేదా అనేది పరిశీలిస్తుంది.
→ బాధితులకు పరిహారం: గాయపడిన విద్యార్థులకు, పోలీసు సిబ్బందికి మధ్యంతర పరిహారం అందించే అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది.


