ముంబై: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ అధికార బీజేపీ చేతిలో ఆయుధంగా మారిపోయారని శివసేన(ఉద్ధవ్) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేలా సీఈసీ పని చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) పేరిట ప్రజల ఓట్లను విచ్చలవిడిగా తొలగిస్తున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ ఠాక్రే మండిపడ్డారు. మహారాష్ట్రలో ఎస్‌ఐఆర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా ఆదివారం ముంబైలో ఠాక్రే సోదరుల నేతృత్వంలో ‘విరాట్ గర్జన మోర్చా’ పేరిట భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
వేలాది మంది జనం హాజరయ్యారు. ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశీయులను తొలగించేందుకు ఎస్‌ఐఆర్ చేపట్టినట్లయితే ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారో చెప్పాలని ఉద్ధవ్ ప్రశ్నించారు. ప్రతిపక్షాల పోరాటం ఏదో ఒక పార్టీ, నాయకుడు, మతం లేదా కులానికి సంబంధించినది కాదని, ఇది దేశ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటమని ఉద్ధవ్ అన్నారు.
ఇది నక్కల యాత్ర: బీజేపీ
శివసేన(ఉద్ధవ్), ఎంఎన్‌ఎస్‌లు ఆదివారం ముంబైలో చేపట్టిన ఈ ర్యాలీ ఒక ‘నక్కల యాత్ర’గా సాగిందని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు ఆశిష్ షెలార్ ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం ప్రపంచ జంతు దినోత్సవం. ఈరోజే శివసేన, ఎంఎన్‌ఎస్ ర్యాలీచేయడం విశేషం. ఇది అచ్చం నక్కల అరుపుల ర్యాలీలా ఉంది. ఎత్తులోని ద్రాక్షను అందుకోలేక నక్క అవి పుల్లగా ఉన్నాయని చెబుతుంది. ఇప్పుడీ పార్టీలు సైతం ఎన్నికల్లో గెలవలేక ఈసీపై నిందలు వేస్తున్నాయి’’ అని విమర్శించారు.


