బుల్లెట్‌ గాయాలకు మూసా తేనె చికిత్స | Pakistani terrorists used Ayurvedic honey remedy to heal wounds | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ గాయాలకు మూసా తేనె చికిత్స 

Oct 5 2026 6:24 AM | Updated on Oct 5 2026 6:24 AM

Pakistani terrorists used Ayurvedic honey remedy to heal wounds

పాక్‌లోని హ్యాండ్లర్లు ఇచ్చిన ఆయుర్వేద సలహాను పాటించిన లష్కరే కమాండర్‌

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: పాకిస్తాన్‌ ఆర్మిలోని స్పెషల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ) మాజీ కమాండర్, ఉగ్రవాది మహ్మద్‌ అసిఫ్‌ అలియాస్‌ హసీమ్‌ మూసా ఇటీవల కశ్మీర్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలోని స్థావరంలో తన బుల్లెట్‌ గాయాలు త్వరగా మానేందుకు స్వచ్ఛమైన తేనెతో ఆయుర్వేద చికిత్స చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఆదివారం ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

 ఈ ప్రాంతంలో నిషేధిత లష్కరే తోయిబాకు చీఫ్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా వ్యవహరించిన మూసా 2025 నాటి పహల్గామ్‌ ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకడు. వారం క్రితం బుద్గాం జిల్లాలోని కొండప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మూసా హతమయ్యాడు. అంతకుముందు జమ్మూ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్‌ షేరువాలీ ఆపరేషన్‌ సమయంలో రాజౌరీలో జరిగిన ఎదురుకాల్పుల్లో మూసాకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. 

ఈ ఆపరేషన్‌ 45 రోజులపాటు కొనసాగింది. మూసా, అతడి అనుచరుడు యాసిర్‌ను బలగాలు ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి. పూంఛ్, రాజౌరీల నడుమ అటవీ ప్రాంతంలో వీరిని దిగ్బంధించారు. ఆ సమయంలో మూసా తన బుల్లెట్‌ గాయాలు మానేందుకు వైద్యం చేయించుకునేందుకు వీల్లేకపోవడంతో అందుబాటులో ఉన్న తేనెతో చికిత్స చేసుకున్నాడు. 

స్వచ్ఛమైన తేనెకు ఇన్ఫెక్షన్‌ను తగ్గించే గుణం ఉందని తెలిసిన ఇతడు, ఆ సమయంలో తేనెతోనే సరిపెట్టుకున్నాడని అధికారులు వివరించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో యూస్‌మార్గ్‌ వద్ద కొండప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యాసిర్‌ హతమయ్యాడు. ఆ సమయంలో అతడి వద్ద ఓ ఫోన్‌ భారతబలగాలకు దొరికింది. అందులో మూసా తన గాయాలకు తేనె రాసుకున్నట్లుగా కొన్ని ఫొటోలు కనిపించాయి. 

మూసాకు అయిన గాయాల ఫొటోలను యాసిర్‌ సరిహద్దు ప్రాంతం వెంబడి ఉన్న పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లకు పంపించాడు. మూసా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సమాచారం అందించాడు. మూసా గాయాలు త్వరగా మానాలంటే పురాతన ఆయుర్వేద విధానాల ప్రకారం స్వచ్ఛమైన తేనె ఉపయోగపడుతుందని సలహా ఇచ్చారు. ఆ మేరకు మూసా తన గాయాలకు తేనె రాస్తూ బలగాలకు కొన్ని రోజులపాటు దొరక్కుండా తప్పించుకున్నాడని అధికారులు వివరించారు. ఎట్టకేలకు బలగాల తూటాలకు బలయ్యాడన్నారు. టాప్‌ ఉగ్ర కమాండర్లలో ఒకడైన మూసా కోసం బలగాలు ఐదేళ్లుగా సాగిస్తున్న వేటకు బలగాలు ముగింపు పలికాయని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement