పాక్‌ వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేసిన పీవోకే ప్రజలు | Protesters Warn Islamabad Of Reaching Out To India | Sakshi
Sakshi News home page

పాక్‌ వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేసిన పీవోకే ప్రజలు

Jun 30 2026 7:00 PM | Updated on Jun 30 2026 7:23 PM

Protesters Warn Islamabad Of Reaching Out To India

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్ పాక్‌లో భాగం కాదని, అంతేగాక తాము భారత్‌తో సంబంధాలు పెంచుకుంటామని పీవోకేలో నిరసనకారులు హెచ్చరించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావలాకోట్ ప్రాంత ప్రజలు వేల సంఖ్యలో నిరసన తెలుపుతున్నారు. పాకిస్థాన్‌ పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆగ్రహం కారణంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ సహా స్థానిక నేతలు నాయకత్వం వహిస్తున్నారు. రావలాకోట్‌లో వేలాది మంది నిరసనకారులు మంగళవారం 22వ రోజూ ఆందోళన కొనసాగించారు.

ఈద్గాహ్ మైదానంలో జరిగిన నిరసనలో పలువురు నాయకులు మాట్లాడారు. పీవోకేను ఇకపై పాకిస్థాన్ అధీన ప్రాంతంగా పరిగణించకూడదని పేర్కొన్నారు. భారత్‌తో మరింత బలమైన సంబంధాలు ఏర్పరచుకునే దిశగా అడుగులు వేస్తామని పాక్‌ సర్కారుని హెచ్చరించారు.

పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అణచివేత, పాలనా నిర్లక్ష్యంపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. నిరసనల సమాచారం బయటకు వెళ్లకుండా, ప్రజల్లో అవగాహన పెరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు జూన్ 5 నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పాకిస్థాన్ అధికారులు 2 వారాల పాటు ఆహార సరఫరా, ఇతర అత్యవసర వస్తువుల రాకపోకలను అడ్డుకోవడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది.

అమన్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్థాన్ పరిపాలనలో ఉన్న కశ్మీర్ పాకిస్థాన్‌లో భాగం కాదని, తమకు పాకిస్థాన్ అవసరం కంటే, పాక్‌కే ఈ ప్రాంత అవసరం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆహారం, ఇతర అత్యవసర వస్తువులపై ఆంక్షలు కొనసాగితే ఈ ప్రాంత ప్రజలు సాయం కోసం భారత్ వైపు చూడవచ్చని అన్నారు. అలా జరిగితే ప్రాంత రాజకీయ పరిస్థితులు మారిపోతాయని, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతుందని అమన్ ఖాన్ చెప్పారు.

ఒక వీడియోలో.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో భాగం కాదని ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌ను తిరస్కరిస్తున్నామని, నియంతృత్వాన్ని సహించబోమని చెప్పారు. ఈ నిరసనలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కే పరిమితం కాలేదు. విదేశాల్లో నివసిస్తున్న మద్దతుదారులు కూడా పలు దేశాల్లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement