ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేవలం దాని నియంత్రణ మాత్రమే తమదేనంటూ ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్యం మోహరించామని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని మరో సంచలనానికి తెర తీశారు.
“ఇరాన్‌ను ఓడించడం ఖాయం. ఆ తర్వాత.. అతి త్వరలో హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు? దీనికి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతుండగా.. ఇరాన్‌పై మరింత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
‘కొంత ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు’.. అమెరికన్లకు ట్రంప్
ఇరాన్‌పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. “అమెరికన్లు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడం ప్రపంచానికి చేసే సేవ” అని అన్నారు.
హర్ముజ్‌పై అధికారం మాదే: ఇరాన్ స్పష్టం
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. “ఒక ట్వీట్‌తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్‌ను స్వాధీనం చేసుకోలేరు. ఇరాన్ ఓటమిని అంగీకరించే వరకు ఈ మార్గంపై మా నియంత్రణ కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచానికి చమురు షాకే!
ప్రపంచ ఇంధన మార్కెట్లకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్‌ఎన్‌జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 4 డాలర్ల స్థాయికి చేరింది.
నిలిచిన చర్చలు.. పెరుగుతున్న ఉద్రిక్తత
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.
హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు కొనసాగితే.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


